నిరక్షరాస్యులు
జిల్లాలో కానరాని రాత్రి బడులు
ఉసూరుమంటున్న ‘ఉల్లాస్’
అక్షరాస్యత తూతూమంత్రం
పర్యవేక్షణలో విఫలమైన యంత్రాంగం
నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్చించి అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఉల్లాస్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని అన్ని మండలాల్లో నిరక్షరాస్యులను ఎంపిక చేసి వారందరికీ రాత్రి పూట బడులు నిర్వహించాల్సి ఉంది. దీన్ని పకడ్బందీగా అమలు చేయాలని నెల క్రితం కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆయా శాఖల అధికారులతో సమావేశమై ప్రత్యేక ఆదేశాలు జారీచేశారు. అయితే ఈ కార్యక్రమం ఇప్పటివరకూ జిల్లాలో ఎక్కడా నిర్వహించడం లేదు. రాత్రి బడుల మాటే వినిపించడం లేదు. అక్షరాలు నేర్పించేవారూ లేరు. ఉల్లాస్ కార్యక్రమం అమలు తీరుపై కలెక్టర్ ఆదేశాలు పట్టించుకునే దిక్కు లేదు. దీంతో ఉల్లాస్.. ఉఫ్ అంటూ నీరుగారిపోతోంది.
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 32 మండలాలున్నాయి. రెవెన్యూ గ్రామాలు 822, గ్రామ పంచాయతీలు 697 ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా మొత్తం జనాభా 18.73 లక్షల జనాభా ఉండగా, పురుషులు 9.4 లక్షలు, మహిళలు 9.33 లక్షలున్నారు. అర్బన్‌లో 3.69 లక్షలు, రూరల్ లో 15.04 లక్షల జనాభా ఉన్నారు.
ఈ జనాభాలో 11.80 లక్షల మంది అక్షరాస్యులుండగా, పురుషుల అక్షరాస్యత శాతం 78.33, మహిళల అక్షరాస్యత శాతం 60.32గా ఉంది. జిల్లాలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు నిర్వహించాల్సిన ‘ఉల్లాస్’ పక్కదారి పడుతోంది. క్షేత్రస్థాయిలో ఆశించిన మేరకు ఈ కార్యక్రమం అమలు కాకపోవడం వల్ల ఉల్లాస్ ఆశయం నీరుగారుతోంది.
నిరక్షరాస్యులు (2011 జనాభా లెక్కల ప్రకారం) 6.93
అధికారులు గుర్తించిన నిరక్షరాస్యులు 9,078
జిల్లాలో నిరక్షరాస్యులు 9,078 మందే
వయోజన విద్య, డీఆర్‌డీఏ, విద్యాశాఖల సమన్వయంతో ఉల్లాస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ శాఖల పరిధిలో జిల్లాలో 9,078 మంది మాత్రమే నిరక్షరాస్యులున్నట్లు గుర్తించారు. వాస్తవంగా అంతకంటే ఎక్కువ మందే జిల్లాలో నిరక్షరాస్యులుంటారు. అయితే నిరక్షరాస్యులను గుర్తించడంలో అలసత్వం వహించడం వల్ల తూతూమంత్రంగా నిర్వహించి, అధికారులు చేతులు దులుపుకున్నారు. జిల్లాలో లక్షలాదిమంది నిరక్షరాస్యులుంటే కేవలం 9,078 మందిని మాత్రమే గుర్తించడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా పర్యవేక్షించాల్సిన ఆయా శాఖల అధికారులు విఫలమయ్యారని తెలుస్తోంది.
తరగతులు నిర్వహించాల్సిందే
ఉల్లాస్ కార్యక్రమం జిల్లాలో మూడేళ్ల పాటు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఆరు నెలలకు ఒక బృందానికి పాఠాలు బోధిస్తారు. ఆరు నెలల్లో 200 గంటల పాటు తప్పనిసరిగా తరగతులు నిర్వహించాలని నిబంధనలు ఉన్నాయి. ఆ తరగతుల్లో ఆర్థిక, సామాజిక, డిజిటల్ అక్షరాస్యతపై మహిళలకు అభ్యసన తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రతి రోజు తరగతులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలి.
నేటి సాంకేతికతపై పట్టు ముఖ్యం
గతంతో పోల్చితే ప్రస్తుతం సాంకేతికత చాలా అభివృద్ధి చెందింది. ఈ సాంకేతికతకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా అవగాహన కల్పించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత రోజుల్లో పల్లె, పట్టణం తేడా లేకుండా ఎక్కడ చూసినా డిజిటల్, సాంకేతికత, నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి. పొదుపు సంఘాల్లోని మహిళలు ఇవన్నీ నేర్చుకోవడం చాలా ముఖ్యం. సాంకేతికతపై పట్టు లేకపోతే సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఉల్లాస్ కార్యక్రమంలో నేటి సాంకేతికతపై అవగాహన కల్పిస్తే పొదుపు సంఘాల మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే జిల్లాలో ఉల్లాస్ కార్య క్రమం నామమాత్రంగా సాగుతుండడంతో ఉల్లాస్ ఆశయం నెరవేరదని విద్యావేత్తలు వెల్లడిస్తున్నారు.
రాత్రి బడుల్లో బోధించాల్సిన అంశాలు
జిల్లాలో నిర్వహించే ఉల్లాస్ కార్యక్రమం రాత్రి బడుల్లో కుటుంబం–ఇరుగు పొరుగు, మన ఆచార వ్యవహారాలు, పరిశుభ్రత– ఆరోగ్యం, ఎన్నికలు, పిల్లల పెంపకం–మన బాధ్యత, చట్టాలు తెలుసుకుందాం, మా ఇంటి మహాలక్ష్మి, డిజిటల్ అక్షరాస్యత వంటి అంశాలతోపాటు తెలుగు భాషను అనర్గళంగా చదవగలగడం, రాయడం, నిత్య జీవితంలో ఉపయోగపడే నైపుణ్యాలను పెంపొందించేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంది. ఈ అన్ని రకాల అంశాలకు సంబంధించి ప్రత్యేక పుస్తకాన్ని రూపొందించి నిరక్షరాస్యులకు అందజేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment