మొర ఆలకించండి.. న్యాయం చేయండి
● కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ● వినతులు స్వీకరించిన కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, జేసీ విద్యాధరి ● పలు శాఖలకు సంబంధించి 178 అర్జీల నమోదు
తాగునీటికి అష్టకష్టాలు
తాగునీటి కోసం అష్టకష్టాలు ఎదుర్కొంటున్నట్లు గంగాధరనెల్లూరు నియోజకవర్గం వేపంజేరి పంచాయతీ చిన్నారెడ్డిపల్లె ఎస్టీ కాలనీవాసులు వాపోయారు. ఈ మేరకు వారు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆ కాలనీవాసులు రమణప్ప, శ్రీనివాసులు మాట్లాడుతూ చాలా రోజులుగా తమ కాలనీలో తాగునీరు లేక అవస్థలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. మండల అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. గతంలో డీకేటీ స్థలంలో బోరు వేశారని, ఓ వ్యక్తి ఆ స్థలాన్ని ఆక్రమించి తమకు నీరు లేకుండా చేస్తున్నట్లు వాపోయారు. అధికారులు న్యాయం చేయాలని కోరారు.
జోగివారిపల్లె పేరునే కొనసాగించాలి
తమ గ్రామం పేరును జోగివారిపల్లెగానే కొనసాగించాలని ఆ గ్రామ స్తులు వెంకటయ్య తదితరులు కోరారు. ఈ మేరకు తవణంపల్లె మండలం జోగివారిపల్లె గ్రామస్తులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ కొందరు వ్యక్తులు తమ గ్రామం పేరును మార్చేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. అధికారులు విచారించి తమ గ్రామం పేరును మార్చకుండా చర్యలు చేపట్టాలని కోరారు.
చిత్తూరు కలెక్టరేట్ : మా మొర ఆలకించి.. సమస్యలు పరిష్కరించండి సారూ అంటూ పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు అధికారులను వేడుకున్నారు. కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు అధికారులకు వినతులు అందజేశారు. కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీఆర్‌ఓ మోహన్‌కుమార్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో పలు శాఖలకు సంబంధించి 178 అర్జీలు నమోదైనట్లు కలెక్టరేట్ ఏఓ కులశేఖర్ వెల్లడించారు. పలు శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
దారి లేక ఇబ్బందులు
దారి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చిత్తూరు రూరల్ మండలం జరిమడుగు యానాది కాలనీకి చెందిన రత్నం తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ తమ కాలనీకి దారి లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. మండల అధికారులకు సమస్య చెప్పినా ఫలితం లేదన్నారు. దారి సమస్య పరిష్కరించి ఇంటి పట్టాలు మంజూరు చేసి గృహాలు నిర్మించుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ కాలనీవాసులు పాల్గొన్నారు.
గోకులం షెడ్లు మంజూరు చేయండి
గోకులం షెడ్లు మంజూరు చేయాలని పూతలపట్టు మండ లం వడ్డేపల్లి పంచా యతీ శేషాపురం ఎస్టీ కాలనీకి చెందిన బుజ్జమ్మ, మౌనిక కోరారు. ఈ మేరకు వారు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ గోకులం షెడ్డు కోసం మండల అధికారుల వద్దకు వెళ్తే ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. అధికారం, పలుకుబడి ఉన్న వారికి మాత్రమే ఈ షెడ్లు మంజూరు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీలైనా తమకు గోకులం షెడ్లు మంజూరు చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment