డిజిటల్ లావాదేవీల్లో జాగ్రత్తలు ముఖ్యం
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజలు డిజిటల్ లావాదేవీలపై కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని ట్రైనీ కలెక్టర్ హిమవంశీ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. పాల్గొన్న ట్రైనీ కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారులు మోసపూరిత ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పా రు. వివిధ మాధ్యమాల్లో వచ్చే వ్యాపార ప్రకటనలను చూసి మోసపోకూడదన్నారు. వినియోగదారుల సంక్షేమం కోసం 24 డిసెంబర్ 1986లో మొట్టమొదటి సారిగా వినియోగదారుల రక్షణ చట్టం అమల్లోకి వచ్చిందన్నారు. ఈ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. వినియోగదారులు ఈ– కామర్స్, డిజిటల్ వ్యాపారాలపై ఎక్కువ మక్కువ చూపుతున్నారని తెలిపారు. ఆన్‌లైన్ కొనుగోలులో గుర్తింపు పొందిన వెబ్‌సైట్‌లను వినియోగించడం మంచిదన్నారు. నగదు చెల్లింపు పేజీలు సురక్షితంగా ఉన్నాయా? లేదా అని పరిశీలించుకోవాలని తెలిపారు. ఉచిత బహుమతులు, డిస్కౌంట్ సేల్స్ వలలో పడకూడదని చెప్పారు. ఖరీదైన వస్తువులను ఆన్‌లైన్‌లో కొనే సమయంలో క్యాష్ ఆన్ డెలివేరి ఆప్షన్ ఎంచుకోవడం మంచిదన్నారు. అనవసరమైన లింకులు, అటాచ్‌మెంట్, యాప్‌లకు దూరంగా ఉండాలని తెలిపారు. స్కామర్ల నుంచి రక్షణ పొందేందుకు ప్రొటెక్టింగ్ సాఫ్ట్‌వేర్లను ఇన్‌స్టాల్ చేసుకోవాలని చెప్పారు. బ్యాంక్ ఖాతా వివరాలు, పిన్ నంబర్, సీవీవీ నంబర్, పాస్‌వర్డ్ లాంటి వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని తెలిపారు. ఏవైనా సమస్యలు ఎదురైతే జాతీయ వినియోగదారుల సహాయ కేంద్రం 14404, 1915 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. అనంతరం మేలుకొలుపు పుస్తకం ఆవిష్కరించారు. డీఎస్‌ఓ శంకరన్, వినియోగదారుల కమిషన్ సభ్యుడు సలీం, పీవీకేఎన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.జీవనజ్యోతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment