ఊరూరా దౌర్జన్యం చేస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులే లక్ష్యం
శిలాఫలకాల తొలగింపు.. విగ్రహాల కూల్చివేతలు
కళ్లెదుటే దాడులు చేస్తున్నా చోద్యం చూస్తున్న పోలీసులు
ఇదేమని ప్రశ్నిస్తే బాధితులపైనే తప్పుడు కేసులు.. ఊరొదిలి వెళ్లాలంటూ మౌఖిక ఆదేశాలు
ఎన్నికల ఫలితాలు వెలువడి పక్షం దాటినా ఆగని దాడులు
ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
తోపల్లిగూడూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం కోడూరుకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత కావల్‌రెడ్డి రంగారెడ్డికి చెందిన ట్రాక్టర్, ఏయిరేటర్లు, ఆక్వా సామగ్రికి టీడీపీ నేతలు గురువారం రాత్రి నిప్పంటించారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి సమీప బంధువైన రంగారెడ్డి ఇటీవలి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కోసం పనిచేశారు. ఇది గిట్టని స్థానిక టీడీపీ నాయకులు అధికారం అండతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని, ఈ ఘటనలో రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు రంగారెడ్డి చెప్పారు.
శుక్రవారం రాత్రి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఘటన స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో మంచి పాలన అందిస్తారని ప్రజలు అధికారం ఇచ్చారని, దానిని విస్మరించి టీడీపీ గూండాలు ఇలా ఆటవిక దాడులు చేయడం దుర్మార్గమన్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకొని సాగుతున్న ఈ దాడులను ఉపేక్షించేది లేదన్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తామన్నారు.
దాడులు ఆపనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పోలీసులు దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు చిల్లకూరు సుధీర్‌రెడ్డి, ఉప్పల శంకరయ్య గౌడ్, కావల్‌రెడ్డి రవీంద్రరెడ్డి, కావల్‌రెడ్డి రంగారెడ్డి, కొడూరు దిలీప్‌రెడ్డి, కాల్తిరెడ్డి సుబ్రహ్మణ్యం, తూపిలి ఉదయకుమార్‌రెడ్డి, చెరుకూరు శ్రీనివాసులనాయుడు, మన్నె చిరంజీవులగౌడ్, విశ్వనాథ్‌రెడ్డి, ఆగాల శ్రీనివాసులరెడ్డి, దగ్గు సతీ‹ష్, పామంజి దుర్గ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment