సూపర్ సిక్స్ హామీలను విస్మరించిన కూటమి
అమలాపురం టౌన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను విస్మరించే దిశగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన అమలాపురంలో శనివారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. కూటమి నాయకులందరూ ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీలపై ఊకదంపుడు ప్రచారం చేశారన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారని, బడ్జెట్‌లో సరైన కేటాయింపులు చేయలేదన్నారు. ప్రజా సంక్షేమంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న విషయం దీని ద్వారా తేటతెల్లమైందన్నారు. అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి శ్రీలంకగా మార్చుతున్నారంటూ గోల పెట్టిన కూటమి ముఖ్య నేతలు.. ఇప్పడు అధికారం వచ్చాక అప్పుల బాట పట్టారన్నారు. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం రూ.91,443 కోట్లను అప్పుగా తీసుకోవాలని నిర్ణయించినప్పటికీ, అందులో సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపులేవని విమర్శించారు. అధికారంలోకి రాగానే 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తామని చేనేత కార్మికులకు చేసిన వాగ్దానాన్ని ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం తప్ప, ప్రజల బాగోగులను కూటమి నాయ కులు పట్టించుకోవడం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment