సమన్వయంతో ప్రభల ఉత్సవం నిర్వహిద్దాం
● దేవదాయ శాఖ
అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ
● జగ్గన్నతోటలో అధికారుల పరిశీలన
అంబాజీపేట: ఏటా కనుమ రోజున మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో నిర్వహించే ఏకాదశ రుద్రుల ప్రభల ఉత్సవాన్ని అధికారులు, ప్రజల సమన్వయంతో అత్యంత వైభవంగా నిర్వహిద్దామని దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ పిలుపునిచ్చారు. సోమవారం జగ్గన్నతోటలో తీర్థం జరిగే ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ 450 ఏళ్లకు పైగా ఏకాదశ రుద్రుల ప్రభల ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారన్నారు. ఈ ఉత్సవంలో 11 గ్రామాల నుంచి ప్రభలను ఊరేగింపు తీసుకువచ్చి జగ్గన్నతోటలో కొలువు దీరుస్తారన్నారు. దేశ విదేశాల నుంచి సుమారు లక్షకు పైగా భక్తులు వచ్చి స్వామివార్లను దర్శించుకుంటారన్నారు. దీనికి సంబంధించి పలు సమస్యలు, ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌కు ఉత్సవ కమిటీ సభ్యులు వివరించారన్నారు. ప్రభల తీర్థానికి తీసుకువచ్చే రహదారుల్లో శానిటేషన్, తుప్పలు తొలగించాలని, తీర్థంలో బూరలు నిషేధించాలని, ప్రభలు వెళ్లే రహదారుల్లో ఏ విధమైన దుకాణాలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని, భక్తులకు తాగునీరు అందించాలని, ట్రాఫిక్ లేకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారన్నారు. ఈ రహదారుల్లో ట్రాఫిక్ ఉండటంతో ప్రభలు వచ్చి వెళ్లడానికి ఎక్కువ సమయం పడుతుందన్నారు. గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం రుద్ర ప్రభలు పంట చేలను దాటుకుంటూ అప్పర్ కౌశిక్ డ్రైన్ దాటి గట్టు ఎక్కి వెళతాయన్నారు. ఈ రెండు ప్రభలు కాలువను దాటుకుని వెళ్లేందుకు సుమారు రెండు గంటల సమయం పడుతుందన్నారు. ఈ కాలువ, పంట చేలు దాటే గట్లకు ఇసుక బస్తాలు వేయడం వల్ల ఈ రెండు ప్రభలు సులువుగా దాటి తీర్థంలోకి వెళ్లేందుకు వీలుగా ఉంటుందని చెప్పారు. తీర్థం, ప్రభలపై ఎటువంటి రాజకీయ, సినీ, ఇతరుల ఫోటోలు పెట్టకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఈ సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో దేవదాయ శాఖాధికారి బి.వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment