పల్లెల్లో ఘుమాళింపు!
కొత్తపేట: సంక్రాంతి వస్తోందంటే తెలుగునాట ప్రతీ ఇల్లు సంప్రదాయ పిండి వంటలతో ఘుమఘుమలాడుతుంటుంది. సంక్రాంతి సమీపిస్తున్న నేపథ్యంలో గృహిణులు సున్నుండలు, పోకుండలు, అరిసెలు, కజ్జికాయలు, జంతికలు వంటి పిండి వంటల తయారీలో బిజీ అయిపోయారు. కోవా, కలకండ, డ్రైఫ్రూట్స్, కోవాపూరి వంటి ఆధునిక పిండి వంటలు సైతం సంక్రాంతి వంటకాల్లో చేరి మరింత మాధుర్యాన్ని అందిస్తున్నాయి. పేద, ధనిక తారతమ్యం లేకుండా పల్లెల్లో ప్రతి ఇంటా పిండివంటల తయారీకి ప్రాధాన్యమిస్తారు. స్తోమత మేరకు జంతికలు, సున్నండలు, బెల్లం ఉండలు, పోకుండలు, రవ్వలడ్లు, పొంగడాలు, అరిసెలు, మైసూర్ పాక్, జంతికలు, కారపు బూందీ తదితర వైరెటీలు చేస్తుంటారు. కొత్తగా వివాహం జరిగిన ఇళ్లలో పిండి వంటల తయారీతో మరింత సందడి నెలకొంటుంది. పండగకు వచ్చే కొత్త అల్లుళ్లు, వియ్యపురాలి కోసం ఎన్నో రకాల పిండి వంటలు సిద్ధం చేస్తుంటారు. దూరప్రాంతాల నుంచి పండగకు వచ్చిన తమ కుటుంబ సభ్యులు, బంధువులకు తిరిగి వెళ్లే సమయంలో వాటిని అందిస్తుంటారు. కొందరు దేశ విదేశాల నుంచి పండగకు వచ్చి తిరిగి వెళుతూ ఈ పిండి వంటలు తీసుకువెళతారు. వారి ద్వారా స్థానికులు అక్కడ ఉన్న తమ బంధువులకు ప్రత్యేకంగా పిండి వంటలు తయారుచేసి పంపుతుంటారు.
హోం ఫుడ్స్ షాపుల్లో సంప్రదాయ పిండి వంటలు
గతంలో ప్రతి ఇంటా మహిళలు, చుట్టుపక్కల వారు కలిసి సంప్రదాయ పిండివంటలు తయారు చేసుకోగా ప్రస్తుత యాంత్రిక జీవనంలో తీరిక లేక ఇళ్ల వద్ద పిండి వంటలు తయారు చేసుకునే తీరిక లేకుండా ఎవరికి వారు బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలో పిండి వంటలు షాపుల్లో కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య పట్టణాల్లోనే కాక గ్రామీణ ప్రాంతాల్లో సైతం పెరుగుతోంది. ఏడాది పొడవునా బెంగాలీ, కలకండ, కోవా, కాజూ పేస్ట్ తదితర వైరెటీ స్వీట్స్ తయారుచేసే స్వీట్స్ షాపుల నిర్వాహకులు సంక్రాంతి పండగల్లో సంప్రదాయ పిండి వంటల తయారీకి ప్రాధాన్యమిస్తున్నారు. కోనసీమ ప్రాంతంలో పలు చోట్ల పేరొందిన స్వీట్స్ షాపులతోపాటు చిన్న షాపుల్లోనూ సంక్రాంతి పిండి వంటల తయారీ ఎక్కువగా కనిపిస్తోంది. గ్రామాల్లో కేటరింగ్ నిర్వాహకులు, స్వీట్స్ తయారీదారులకు పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయి. ప్రస్తుతం సంక్రాంతి సీజన్ కాడంతో మహిళలు షిప్టులవారీగా పనిచేస్తున్నారు. రావులపాలెం, ఆత్రేయపురం, అమలాపురం, పీ గన్నవరం, అంబాజీపేట, రాజోలు, ముమ్మిడివరం, అల్లవరం, మల్కిపురం తదితర ప్రాంతాల్లో ప్రత్యేకంగా సంప్రదాయ పిండి వంటల దుకాణాలు వెలిశాయి. ఇళ్లల్లో మహిళలు ప్రయాస పడకుండా ఆయా షాపుల్లో రడీమేడ్ పిండి వంటలు కొనుగోలు చేస్తున్నారు.
సంక్రాంతి పిండి వంటల తయారీలో
గృహిణులు బిజీ
సిద్ధమవుతున్న సున్నుండలు,
పోకుండలు, కజ్జికాయలు, అరిసెలు
హోం ఫుడ్స్ షాపుల్లోనూ
సంప్రదాయ వంటలకు భారీగా ఆర్డర్లు
దేశ, విదేశాల్లోని బంధువుల కోసం ప్రత్యేకంగా తయారీ
Comments
Please login to add a commentAdd a comment