● పి.గన్నవరం నియోజకవర్గంలో
పదవులకు ధరలు
● రూ.రెండు లక్షలు ఇస్తే
సొసైటీ చైర్మన్ పదవి
● హల్‌చల్ చేస్తున్న
జనసేన నేత వాయిస్ రికార్డ్
సాక్షి అమలాపురం: ‘‘ఇప్పుడు రాజకీయ వ్యవస్థ ఎలా ఉందంటే పనిచేస్తే పదవులు రావు. నేను పార్టీకి ఎంతో ఖర్చు పెట్టాను. పదవి లేకపోవడం వల్ల నోర్మూసుకుని కూర్చున్నాను. నాకు దేవస్థానం పదవి కావాలంటే రూ.ఏడు లక్షలు అడిగారు. అంత ఇవ్వలేక ఊరుకున్నాను. మీరు మా ఇంటిలో మనిషి కాబట్టి రూ.రెండు లక్షలు ఇస్తే పదవి ఇప్పిస్తాను. అవతల వ్యక్తి రూ.ఐదు లక్షలు ఇస్తానన్నారు’. ఇది మామిడికుదురు మండలం పాశర్లపూడిలంకకు చెందిన ఒక జనసేన నేత పీఏసీఎస్ పదవి ఆశిస్తున్న వ్యక్తి కుటుంబానికి ఇచ్చిన బంపర్ ఆఫర్. సదరు బేరంపెట్టిన నాయకుడు, పదవి ఆశిస్తున్న పార్టీ నాయకుడు మధ్య జరిగిన సంభాషణ సోమవారం రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా హల్‌చల్ చేస్తోంది.
పదవుల అమ్మకం!
ప్రశ్నించే పార్టీలో నామినేటెడ్ పదవుల అమ్మకం, వాటికి కట్టిన రేటు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మూడక్షరాల జనసేన నేత మండల వ్యాప్తంగా సహకార సంఘాలకు వేసే త్రీమెన్ కమిటీ ఆశావహులకు ఫోన్‌లు చేసి ఆఫర్లు ఇవ్వడం గమనార్హం.
● అంబాజీపేట పీఏసీఎస్ తీవ్ర ఉత్కంఠ రేపింది. టీడీపీ, జనసేన పార్టీల మధ్య, జనసేనలో కొర్లపాటివారిపాలెం, మాచవరం అని రెండుగా విడిపోయి ప్రాంతీయ విబేధాలకు దారితీసింది. టీడీపీలోను, జనసేన పార్టీలలో సైతం వర్గపోరుకు తెరతీసింది. చివరకు మాచవరానికి చెందిన అరిగెల సూరిబాబుకు పదవి ఇచ్చినా ఎమ్మెల్యే అసంతృప్తిగానే ఈ పదవి కట్టబెట్టడం గమనార్హం.
● ఇదే మండలంలో గంగలకుర్రు సొసైటీకి తొలి నుంచి శెట్టిబలిజ వర్గానికి చెందిన వారికి ఇస్తారు. అయితే ఈసారి జనసేనకు ఇస్తామని చెప్పి ఇక్కడ కాపు వర్గానికి చెందినవారికి ఇవ్వడంపై జనసేనలోని శెట్టిబలిజ వర్గీయులు, టీడీపీ వారు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment