తెలుగు రక్షణ అమ్మ నుంచే ఆరంభం
రాజానగరం: ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అంటూ శ్రీకృష్ణదేవరాయులుతో ఏనాడో కితాబు అందుకున్న భాష... ఆధునిక సమాజంలో పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో ఆదరణకు దూరమవుతున్న వేళ .. అమ్మ భాషను పరిరక్షించుకోవాలంటే అది అమ్మ నుంచే ప్రారంభం కావాలని పలువురు వక్తలు అభిప్రాయ పడ్డారు. అమ్మ భాష కమ్మదనాన్ని, మాతృ భాష ప్రాశస్థ్యాన్ని, ప్రాచీనతను కాపాడేందుకు ఎందరో మహనీయులు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా గోదావరి తీరాన రాజమహేంద్రవరానికి చేరువలో ఉన్న గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జిజియు)లో చానల్సర్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించేందుకు బుధవారం శ్రీకారం చుట్టారు. ఆదికవి నన్నయ, రాజరాజనరేంద్రుడు, కందుకూరి వీరేశలింగం పేరిట ఏర్పాటు చేసిన మూడు వేదికలపై నుంచి మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, మహాసహ్రసావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు, సాహితీవేత్త యర్రాప్రగడ రామకృష్ణ, ప్రముఖ సినీ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ఎంపీ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఆధ్యాత్మికవేత్త పి.బంగారయ్యశర్మ, ప్రొఫెసర్ చామర్తి కేటీ రామరాజు, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా సోలోమెన్ డార్విన్, మాజీ ఎమ్మెల్సీ గోనె ప్రకాశరావు, శతావధాని కడిమెళ్ల వరప్రసాద్, ధూళిపాల మహాదేవమణి, పారిశ్రామికవేత్త మృత్యుంజయేశ్వర్, వైద్య ప్రముఖులు కన్నయ కదంజి, శాస్త్రవేత్త ఆర్. శ్యామసుందర్, వంటి ఎందరో ప్రముఖులు తెలుగు భాష విశిష్టతను, ఔనత్యాన్ని, తెలియజేస్తూ ప్రసంగించారు.
ఉగ్గు పాలతో ప్రారంభించాలి.
సృష్టిలో భాషలెన్ని ఉన్నా, తెలుగు భాషకు ఉన్న విశిష్టత, మాధుర్యం, అక్షరాల అల్లిక, పదాల పలకరింపులు మరే ఇతర భాషలలోను లేవంటూ ప్రాచీన భాష అయిన తెలుగు ప్రాశస్థ్యాన్ని తెలియజేశారు. మాతృభాషను మరుగున పరిచేలా ఏర్పడుతున్న ప్రస్తుత పరిస్థితులకు అందరూ కారకులేనని వివరించారు. ‘మమ్మీ, డాడీ..’ అనే అంగ్ల పదాల పలకరింపులతో పులకరించిపోతున్న తల్లిదండ్రులు ప్రధాన కారకులనే విషయాన్ని తేటతెల్ల చేశారు. ఈ కారణంగా మన భాషకు పూర్వ వైభవం రావాలంటే అది తల్లిదండ్రుల చేతుల్లోనే ఉందని, తమ పిల్లలకు ఉగ్గుపాలతో పదాలను పలకడం నేర్పిన విధంగానే తెలుగు భాషను ప్రతి ఇంటా పలకాలని, అది అమ్మ నుంచే ప్రారంభించాలని సూచించారు. కవులు, సాహితీవేత్తలు, విద్యార్థులు కూడా ఇదే అంశాన్ని వినిపించారు.
ప్రపంచ తెలుగు మహాసభలలో పలువురి సూచన
Comments
Please login to add a commentAdd a comment