ఇంటిలో వాడుక భాష కావాలి
ఇటువంటి సభలు, సదస్సుల వలన ప్రయోజనం ఉంటుంది. భావితరాల వారిలోనూ మార్పు వస్తుంది. అయితే అందుకు మనం కూడా కొంత ప్రయత్నం చేయాలి. తెలుగు వారి ప్రతి ఇంటిలో వాడుక భాషగా తెలుగు కచ్చితంగా ఉండాలి. గతంలో తాత, నానమ్మలు పెద్ద బాలశిక్ష, చిన బాలశిక్షలతో అన్నీ నేర్పేవారు, ఇప్పుడు అవేమీ లేవు. అంతా ఏ ఫర్ యాఫిల్, బి ఫర్ బాల్ అయిపోయింది. అది మార్చాలంటే ఇంటిలో అమ్మ శ్రద్ధ తీసుకోవాలి.
– ఆధ్యాత్మికవేత్త పి.బంగారయ్యశర్మ
ఇటువంటి సదస్సులు
తరచూ జరగాలి
తెలుగు భాష పటిష్టత కోసం ఇటువంటి సదస్సులు తరచు జరగాలి. ఏ ఒక్కరితోనో వీటిని వదిలేయకుండా ప్రతి ఒక్కరూ వీటిలో భాగస్వాములైతే భాషా ఔన్నత్యం పెరుగుతుంది. ప్రభుత్వాలు కూడా వీటిపై దృష్టిని పెట్టి, ప్రభుత్వ కార్యకలాపాలన్నిటిలోను తెలుగు భాషకు ప్రాధాన్యమిస్తే, ప్రస్తుత తరంతోపాటు భావితరాలు కూడా మాతృ భాష పట్ల ఆదరణ, అభిమానం చూపిస్తాయి.
– మంజునాఽథ్, విద్యార్థి
మాతృ భాషకు అన్యాయం చేస్తున్నారు
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలుగు వాడు బతికేయగలుగుతున్నాడు. అపారమైన తెలివితేటలున్నవాడు కావడమే దీనికి ప్రధాన కారణం. ఇదే క్రమంలో ఆంగ్ల భాషపై పట్టుసాధించాలనే తపనతో మాతృభాషకు అన్యాయం చేస్తున్నామనే విషయాన్ని ఈ మేధావి గుర్తించలేకపోతున్నాడు. తెలుగు మాట్లాడమే నామోషీగా భావిస్తున్నాడు. అందుకనే తెలుగు భాష వాడకం తగ్గిపోతోంది. ఇది మారాలి.
– శైలజ, విద్యార్థి
తల్లిదండ్రులదే బాధ్యత
జన్మనిచ్చిన అమ్మ ఉగ్గుపాలతో మాటలు నేర్పిస్తుంది. అంటే అమ్మ ఏ భాషను నేర్పిస్తే, బిడ్డ అదే నేర్చుకుంటాడు. ఈ క్రమంలో మన మాతృభాష గురించి తల్లిదండ్రులు ఏధంగా చెబితే పిల్లలు దానినే ఆచరిస్తారు. అంటే మాతృభాష పరిరక్షణ విషయంలో తల్లిదండ్రులదే ప్రధాన బాధ్యత అంటాను. ఎందుకంటే చదువు కోసం, ఆపై ఉద్యోగాల కోసం పరాయి భాషలను నేర్చుకున్నా ఇంటిలో మాతృ భాషను మరవనప్పుడు ఆ ఇంటిలో మాతృభాష పదికాలాలపాటు పరిఢవిల్లుతుంది.
–మనోజ్ఞ, విద్యార్థి
తెలుగు భాష అంటే ఎంతో ఇష్టం
తెలుగు భాష అంటే ఎంతో ఇష్టం. ఇంగ్లిష్‌లో మాట్లాడటం అంటే ఒక ఫ్యాషన్ అయిపోవడంతో అంతా అటువైపు చూస్తున్నారుగానీ, తెలుగులో ఉన్న పదాలు, పదనిసలు మరే భాషలోనూ కనిపించవు. అందుకనే తెలుగంటే నాకెంతో ఇష్టం.
– కీర్తి, విద్యార్థి
తెలుగు సంస్కృతికి
దూరమవుతున్నారు
ప్రపంచీకరణలో భాగంగా ఏర్పడిన ప్రాశ్చాత్య సంస్కృతి కారణంగా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను మమ్మీ, డాడీల కల్చర్‌తో తెలుగు సంస్కృతికి దూరం చేస్తున్నారు. ఇటువంటి సభభలు నిర్వహించడం వలన విద్యార్థులలో మాతృభాషపై అవగాహన ఏర్పడటానికి, తల్లిదండ్రులలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంగ్లిష్ నేర్చుకోవడం మంచిదే కానీ, ఇంటిలో కూడా ఇంగ్లిష్‌లోనే మాట్లాడుకుంటే మన మాతృభాష ఏమవుతుందనే విషయాన్ని తెలుగు వారైన ప్రతి తల్లి, తండ్రి గ్రహించాలి.
– గోనె ప్రకాశరావు, ఎమ్మెల్సీ
Comments
Please login to add a commentAdd a comment