తడవని మడి
40 రోజులు..
31 టీఎంసీలు
రబీ మొదలైన తరువాత మంగళవారం వరకు తూర్పు డెల్టాకు 10.323, మధ్య డెల్టాకు 5.559, పశ్చిమ డెల్టాకు 10.323 టీఎంసీలు చొప్పున మొత్తం 31.658 టీఎంసీల నీరు విడుదల చేశారు. పంట కాలువ వ్యవస్థ అధ్వానంగా ఉండడం, చేలల్లో ముంపు నీరు దిగకపోవడం, విత్తనాల కొరత, వెరసి సాగుపై రైతులు నిర్లిప్తత.. ఇలా కారణాలు ఏదైనా ప్రస్తుత రబీ అంచనాల కన్నా ఆలస్య మవడం వల్ల మే నెలలో వచ్చే అకాల వాయుగుండాలు, తుపాన్ల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది.
సాక్షి, అమలాపురం: గోదావరి డెల్టాలో రబీ ‘సాగు’తోంది. పంట షెడ్యూలు మొదలై నెల రోజులు దాటినా ఇంత వరకూ మూడో వంత మాత్రమే నాట్లు, వెదజల్లు విధానంలో సాగయ్యింది. ఇదే సమయంలో డెల్టాలో శివారు ప్రాంతాలకు సాగునీరు అందకపోవడం రైతులకు కొత్త తలనొప్పి తెస్తోంది. జిల్లాలో రబీ వరిసాగు లక్ష్యం 1.60 లక్షల ఎకరాలు కాగా.. ఇంత వరకు కేవలం 62 వేల ఎకరాల్లో మాత్రమే పనులు జరిగాయి. దీనిలో 48 వేల ఎకరాల్లో వెదజల్లు, 14 వేల ఎకరాల్లో నాట్లు వేశారు.
నత్తనడకన..
రబీ షెడ్యూల్ డిసెంబర్ ఏడో తేదీన మొదలైంది. ఆ సమయంలో బంగాఖాళాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు సాగు ఆలస్యమైంది. అయితే ఇప్పుడు షెడ్యూలు మొదలై 40 రోజులు దాటుతున్నా సాగు నత్తనడకన జరుగుతోంది. గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు. నాట్లు ఆలస్యంగా పడితే ఏప్రిల్ 15 తర్వాత కూడా సాగునీరు విడుదల చేయాల్సి వస్తుంది.
కొరవడిన ప్రభుత్వ సహకారం
ముందస్తు సాగు చేద్దామని కొందరు రైతులు భావించించినా డిసెంబర్ మొదటి పది రోజులు వాతావరణం సహకరించలేదు. తీరంలో వర్షాలు కారణంగా చేల నుంచి ముంపు నీరు వీడకపోవడంతో పనులు సాగలేదు. ఉప్పలగుప్తం, కాట్రేనికోన, అల్లవరం, సఖినేటిపల్లి, మలికిపురం మండలాల్లోని చేలల్లో రెండు, మూడు అడుగుల లోతున నీరు ఉండడంతో నారుమడులు వేయలేకపోయారు. వేసిన చోట వర్షాలు ముంచెత్తాయి. దీనితో రెండోసారి నాట్లు వేయాల్సి వచ్చింది. తరువాత బొండాల రకం (ఎంటీయూ 3626) రకం విత్తనాలు దొరకకపోవడం కూడా సాగు మందకొడిగా సాగడానికి కారణమైంది. వీటన్నింటికన్నా ప్రధానమైన కారణం. రైతులు వద్ద పెట్టుబడులకు సరిపడా సొమ్ములు లేవు. ఖరీఫ్ పంట పండినా వర్షాల వల్ల దిగుబడి కోల్పోయి నష్టాలు చూశారు. నష్టపోయిన పంటకు ప్రభుత్వం నుంచి పెట్టుబడి రాయితీ రాలేదు. కనీసం ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకంలో ఇస్తామన్న రైతుకు పెట్టుబడి సాయం ఇంత వరకు ఇవ్వలేదు. దీనితో రైతులకు అప్పు పుట్టక సాగు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు.
శివారుకు అందని సాగునీరు
అవాంతరాలను అధిగమించిన సమయంలో ఇప్పుడు డెల్టాలో శివారు ప్రాంతాలకు సమృద్ధిగా సాగునీరందకుండా పోయింది. గోదావరిలో జలాలు అందుబాటులో ఉన్నాయని, ఈ ఏడాది నీటి ఎద్దడి రాదని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. నీరందక విత్తనాలు జల్లిన మడులు ఎండిపోయే దుస్థితి ఏర్పడింది. సఖినేటిపల్లి, మలికిపురం, మామిడికుదురు, అల్లవరం, ఉప్పలగుప్తం, ఐ.పోలవరం, అమలాపురం మండలాల్లో శివారు, మెరక ప్రాంతాలకు సాగునీరు అందడం లేదు. డెల్టాలో పంట కాలువలకు అధికంగా నీరు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి మంగళవారం తూర్పు డెల్టాకు 3,780, మధ్య డెల్టాకు 2,460, పశ్చిమ డెల్టాకు 6,570 క్యూసెక్కుల చొప్పున మొత్తం 12,810 క్యూసెక్కులు విడుదల చేశారు. ఇంత పెద్ద ఎత్తున నీరు విడుదల చేయడం మంచిదే అయినా డెల్టా కాలువ వ్యవస్థ ఆధ్వానంగా ఉండడం వల్ల శివారు, మెరక ప్రాంతాలకు సాగునీరు అందడం లేదు.
ముందుకు సాగని రబీ
1.60 లక్షల ఎకరాల లక్ష్యం
ఇప్పటివరకు 62 వేల ఎకరాల్లో పనులు
శివారులో మొదలైన నీటి కష్టాలు
పెట్టుబడి కోసం రైతుల అవస్థలు
నారు ఎండిపోయే పరిస్థితి
మా ప్రాంతానికి పూర్తిగా నీరు రావడం లేదు. దీనితో మా చేలల్లో నారుమడులు ఎండిపోయేలా ఉన్నాయి. మొన్నటి వరకు నారు వేయలేని పరిస్థితి. ఇప్పుడు నారుమడికి నీరందని దుస్థితి. శివారులో సాగు చేయడం చాలా కష్టంగా మారింది. రబీ పెట్టుబడికి సొమ్ములు చేతిలో లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు.
– చవ్వాకుల ప్రభు కుమార్, రైతు, శంకరగుప్తం, మలికిపురం మండలం
అధికారుల పర్యవేక్షణ లేదు
నేను రెండు ఎకరాలు సాగు చేస్తున్నాను. ముంపు నీరు దిగనందున సాగు ఆలస్యమైంది. నారుమడి వేసి వారం రోజులు అయింది. మా సమీపంలో ఉన్న పాయకరావుకోడు నుంచి నీరు దిగడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత డ్రెయిన్లపై అధికారుల పర్యవేక్షణ లేకుండా పోయింది.
– చిక్కం సీతారామ ప్రసాద్, రైతు, ఉప్పలగుప్తం
Comments
Please login to add a commentAdd a comment