ఇంటర్మీడియెట్ సిలబస్ తగ్గించాలి
అమలాపురం టౌన్: ఇంటర్మీడియెట్‌లో అన్ని సబ్జెక్ట్‌ల్లోనూ సిలబస్ తగ్గించాలని, ముఖ్యంగా మొదటి సంవత్సరం గణితంలో సిలబస్‌ను అత్యవసరంగా తగ్గించాలని విశ్రాంత అధ్యాపకులు సూచించారు. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియెట్ విద్యలో అమలైన సంస్కరణలపై మంగళవారం ఉదయం సదస్సు జరిగింది. పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోలా వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో జిల్లా ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డీఐఈవో) వనుము సోమశేఖరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశ్రాంత ప్రిన్సిపాల్ పేర్రాజు, విశ్రాంత అధ్యాపకులు చంద్రరావు, సాయిరామ్, వెంకట మంగారామ్, సత్యనారాయణతోపాటు పలు కళాశాలల్లో పనిచేసిన సిబ్బంది పాల్గొని ఇంటర్ విద్య సంస్కరణలో ఇంకా చేర్చాల్సిన అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇంటర్ విద్యలో ఏ ఏడాదికాఏడాది పరీక్షలు నిర్వహిస్తున్న తీరు బాగుందని, అదే విధానాన్ని కొనసాగించాలని సూచించారు. విద్యార్థులు తాము చదివిన దానిని నిత్య జీవితంలో అన్వయించుకునేలా పాఠ్యాంశాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. స్పాట్ వాల్యుయేషన్ అనేది పాత విధానంలోనే కొనసాగిస్తేనే బాగుంటుందని చెప్పారు. అడిషనల్ కోర్సులు ప్రవేశపెడితే వాటిని సైన్స్ గ్రూపునకు జత చేయకుండా బ్రిడ్జ్ కోర్సులోనే కొనసాగించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment