గణతంత్ర దినోత్సవానికి సన్నద్ధం
అమలాపురం రూరల్: జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఈనెల 26వ తేదీన 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారులతో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో వివిధ విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని మినిట్ టు మినిట్ కార్యక్రమాన్ని సిద్ధం చేయాలన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ, పోలీస్ కవాతు, గౌరవ వందన స్వీకరణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, శాంతి భద్రతలు పరిరక్షణ ఏర్పాట్లను పోలీసు విభాగం చేపట్టాలన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్‌సీసీ కార్యక్రమాల ప్రణాళికను రూపొందించాలన్నారు. డీఐపీఆర్‌ఓ, సీపీఓ సహకారంతో జిల్లాలో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతి నివేదికలను సీపీవో ద్వారా సమీకరించుకుని ముఖ్య అతిథుల ప్రసంగ నివేదికను తయారు చేయాలన్నారు. ఇటీవల కాలంలో ఆయా శాఖలు చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాల ప్రగతిని ప్రతిబింబించే రీతిలో శకటాలను రూపొందించి పోటీలకు సిద్ధపరచాలన్నారు. డీఆర్‌ఓ బీఎల్‌ఏ రాజకుమారి, ఆర్డీఓ కె.మాధవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం.దుర్గారావు దొర, మున్సిపల్ కమిషనర్ రాజు, డీఐపీఆర్ ఓ కె.లక్ష్మీనారాయణ, వికాస జిల్లా మేనేజర్ జి.రమేష్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment