వెయ్యి హెక్టార్లలో కొబ్బరి తోటల పునరుద్ధరణ
అమలాపురం రూరల్: జిల్లా వ్యాప్తంగా వెయ్యి హెక్టార్లలో కొబ్బరి తోటల పునరుద్ధరణకు నిధులు వచ్చినట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. జనరల్ కేటగిరీలో 860 హెక్టార్లలో తోటల పునరుద్ధరణకు అర్హులను గుర్తించామన్నారు. ఈ మేరకు జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీతో కలెక్టరేట్‌లో బుధవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ముదురు, కాయలు కాయని, రోగాల బారిన పడిన కొబ్బరి తోటలు స్థానే కొత్త తోటల పునరుద్ధరణ కోసం చర్యలు చేపట్టాలని ఉద్యాన అధికారులను ఆదేశించారు. దీని అమల్లో భాగంగా పునరుద్ధణ పథకం జిల్లా స్థాయి కమిటీ క్షేత్రస్థాయి పరిశీలనను పూర్తి చేసిందని, రానున్న ఏడాది కోసం కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతు ఉత్పత్తి దారుల సంఘాల ద్వారా సంబంధిత ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. కొబ్బరి అభివృద్ధి బోర్డు నుంచి మరిన్ని నిధులు జిల్లాకు కేటాయించేలా చర్యలు చేపట్టాలన్నారు. అమలాపురం మండలం ఇందుపల్లి, అంబాజీపేట మండలం వాకలగరువు, గంగలకుర్రు. పుల్లేటికుర్రు, అయినవిల్లి మండలం మాగం, క్రాప, ముమ్మిడివరం మండలం లంకాఫ్ ఠాణేలంక గ్రామాల్లో తనిఖీ నిర్వహించారన్నారు. ఒక్కొక్క హెక్టారుకు రెండేళ్ల పాటు మొక్కల పెంపకానికి ఈ పునరుద్ధరణ పథకం ద్వారా రూ.53,500 అందించడం జరుగుతుందన్నారు. సమావేశంలో జిల్లా ఉద్యాన అధికారి బీవీ రమణ, జిల్లా వ్యవసాయ అధికారి కాకి నాగేశ్వరరావు, జిల్లా పట్టుపరిశ్రమ అధికారి బి.గీతారాణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment