ఆటహాసంగా.. | - | Sakshi
Sakshi News home page

ఆటహాసంగా..

Published Tue, Dec 26 2023 11:32 PM | Last Updated on Tue, Dec 26 2023 11:32 PM

- - Sakshi

ప్రకాశం నగర్‌ (రాజమహేంద్రవరం): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆడుదాం ఆంధ్రా క్రీడా సంబరాలు మంగళవారం జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ పోటీలకు శ్రీకారం చుట్టారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఈ పోటీలను ఎంపీ మార్గాని భరత్‌రామ్‌, కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ, క్రీడా పతాకాలను ఆవిష్కరించారు. గాలిలోకి బెలూన్లు, శాంతి కపోతాలను ఎగుర వేశారు. కలెక్టర్‌ మాధవీలత క్రీడా జ్యోతి వెలిగించి, మార్చ్‌ ఫాస్ట్‌ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం క్రీడా ప్రతిజ్ఞ చేశారు. వుమెన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ చెస్‌ చాంపియన్‌ ప్రత్యూషను క్రీడాకారులకు పరిచయం చేశారు. క్రికెట్‌, కబడ్డీ పోటీలను కలెక్టర్‌, ఎంపీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ మాట్లాడుతూ, యువతకు క్రీడలపై ఆసక్తి, ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకే ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారని అన్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ, ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్లా ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. గ్రామ/వార్డు సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో 47 రోజుల పాటు ఈ క్రీడా పోటీలు జరుగుతాయన్నారు. క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు.

511 సచివాలయాల్లో..

కలెక్టర్‌ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలోని 511 సచివాలయాల్లో ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామన్నారు. యువత ముందుకు వచ్చి ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. జిల్లాలో 1,77,548 మంది రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారన్నారు. క్రికెట్‌, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, కబడ్డీ, ఖోఖోతో పాటు యోగా, టెన్నికాయిట్‌, మారథాన్‌ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. క్రికెట్‌కు 59,347 మంది, బ్యాడ్మింటన్‌కు 17,172 మంది, వాలీబాల్‌కు 33,353 మంది, కబడ్డీకి 33,224 మంది, ఖోఖోకు 33,831 మంది పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఈ క్రీడా పోటీలకు జిల్లాలో 367 మైదానాలను ఎంపిక చేశామని, వాటిలో క్రికెట్‌కు 198, బ్యాడ్మింటన్‌కు 306, వాలీబాల్‌కు 334, కబడ్డీకి 330, ఖోఖోకు 322 మైదానాలను కేటాయించామన్నారు. ఫిబ్రవరి 10వ తేదీ వరకూ 47 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ క్రికెట్‌ను ప్రారంభించి, కబడ్డీ పోటీలను తిలకించారు. వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ కె.దినేష్‌ కుమార్‌, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా) చైర్మన్‌ రౌతు సూర్యప్రకాశరావు, వైఎస్సార్‌ సీపీ సిటీ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌, అడిషనల్‌ కమిషనర్‌ పీఎం సత్యవేణి, డిప్యూటీ కమిషనర్‌ జి.సాంబశివరావు, ఎస్‌ఈ జి.పాండురంగారావు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్‌ దిలీప్‌, జిల్లా స్పోర్ట్స్‌ అధికారి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

మొదలైన ఆడుదాం ఆంధ్రా

క్రీడా సంబరాలు

జిల్లా వ్యాప్తంగా ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, అధికారులు

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement