ఆరు.. ప్రచారం జోరు.. | Sakshi
Sakshi News home page

ఆరు.. ప్రచారం జోరు..

Published Mon, May 6 2024 10:50 AM

ఆరు.. ప్రచారం జోరు..

ప్రచారానికి మిగిలింది ఆరు రోజులే

దూకుడు పెంచిన అభ్యర్థులు

విజయమే లక్ష్యంగా

ప్రధాన పార్టీల వ్యూహాలు

ఎండను సైతం లెక్క

చేయకుండా పర్యటనలు

కాకినాడ సిటీ: సభలు.. సమావేశాలు.. రోడ్‌ షోలతో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రచారానికి ఇంకా ఆరు రోజులే మిగిలింది.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలోని పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సమయం దగ్గర పడడంతో ఏ మాత్రం వృథా చేయకుండా రోజంతా పర్యటనలతో మునిగితేలుతున్నారు. అగ్రనేతల పర్యటనలతో సైతం మరింత జోష్‌ వచ్చింది. 42 డిగ్రీల ఎండలను సైతం లెక్క చేయకుండా ఇంటింటికీ వెళ్లి అభ్యర్థులు ఓట్లు అడుగుతున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల్లో టెన్షన్‌ మొదలైంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు సభలు, సమావేశాలు, రోడ్‌ షోలు నిర్వహిస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నం వేళ కొంత విశ్రాంతి ఇచ్చి ఉదయం, సాయంత్రం వేళ జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు తమ ఐదేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులను వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు వివరిస్తూ ప్రచారంలో ముందు ఉంటున్నారు. మిగిలిన పార్టీలకు చెందిన అభ్యర్థులు మాత్రం నామమాత్రంగా ప్రచారం సాగిస్తున్నారు. మొత్తం మీద ఉన్న కొద్ది సమయాన్ని వినియోగించుకుంటూ ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాల్లో పర్యటనతో వైఎస్సార్‌ సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. దీంతో ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు.

వారం రోజులే గడువు

మరో వారంలో అంటే ఈ నెల 13న సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలకు 48 గంటల ముందే ప్రచారాన్ని ఆపేయాలనే ఎన్నికల కమిషన్‌ నిబంధనలు ఉన్నాయి. దీంతో ఉన్న సమయాన్ని అభ్యర్థులంతా వినియోగించుకుంటున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల వారీగా ప్రచారాలు సాగిస్తున్నారు. తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. తమకు అవకాశం ఇస్తే పార్లమెంట్‌, అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇస్తున్నారు. కాకినాడ లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులైతే పోర్టును అభివృద్ధి చేస్తామని, పోలవరం ప్రాజెక్టు, కాకినాడ మెయిన్‌ రైల్వే లైన్‌పై చర్చిస్తున్నారు. తమను గెలిపిస్తే ఈ సమస్యలన్నీ పరిష్కరించడంతో పాటు ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తిచేసి రైతాంగానికి అండగా ఉంటామని ప్రకటిస్తూ ప్రచారంలో ముందుకెళ్తున్నారు. గడిచిన వారం రోజుల్లో ఎండ తీవ్రత కూడా భారీగా పెరిగింది. ఉష్ణోగ్రతలు 42కు చేరుకున్నాయి. ఎండ వేడి పెరిగినా అభ్యర్థులు మాత్రం తమ ప్రచారాన్ని ఆపడం లేదు. పగలంతా ప్రచారం నిర్వహించి రాత్రి వేళ కుల సంఘాలు, గ్రామ పెద్దలతో సమావేశాలు నిర్వహించి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.

మద్దతు కోరుతూ ముందుకు..

కాకినాడ జిల్లాలో పార్లమెంట్‌ నియోజకవర్గంతోపాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ప్రచార వేగాన్ని పెంచారు. పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు, భార్యలు, కుమారులు, కుమార్తెలు, అల్లుళ్లు సైతం ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో పర్యటిస్తూ స్థానిక నేతలందరినీ ప్రచారంలో భాగస్వామ్యం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ప్రజలకు, రైతులకు, ఇతర వర్గాలకు అమలు చేసిన సంక్షేమ పథకాలను వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు తెలుపుతున్నారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్‌ పరిధిలో, అసెంబ్లీ పరిధిల్లో చేసిన పనులను వివరిస్తున్నారు. మళ్లీ అవకాశం ఇస్తే చేయబోయే పనులకు హామీలు ఇస్తూ ఓటర్ల మద్దతు కూడగట్టుకుంటున్నారు. టీడీపీ, జనసేన నాయకులు కల్లబొల్లి హామీలు, అమలుకాని మేనిఫెస్టోను పట్టుకొని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు ప్రచారం సాగిస్తున్నారు. మళ్లీ ప్రజలను మోసపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు ప్రకటించిన పథకాలను ప్రజలు నమ్మకపోవడంతో అభ్యర్థుల్లో ఓటమి భయం పట్టుకుంది. జిల్లాలో కాంగ్రెస్‌ పార్లమెంట్‌ అభ్యర్థి కూడా కాంగ్రెస్‌ నేతలతో కలసి పర్యటిస్తున్నారు. గతంలో రెండుసార్లు ఎంపీగా, కేంద్రమంత్రిగా చేసినట్లు గుర్తు చేస్తూ గతంలో తనకు ఉన్న క్యాడర్‌, పార్టీ నేతలను కలుపుకొని సాగుతున్నారు.

Advertisement
Advertisement