నేటి నుంచి పొగాకు పరిశోధన కమిటీ సమావేశాలు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్):
స్థానిక కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ(సీటీఆర్‌ఐ)లో సోమవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకూ పొగాకు పరిశోధన కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సీటీఆర్‌ఐ డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది జరిగిన పరిశోధనలపై కూలంకషంగా చర్చించి, భవిష్యత్తు ప్రణాళికలను నిర్దేశించి, పరిశోధనలకు రూపకల్పన చేస్తామని పేర్కొన్నారు. దాదాపు 20 నూతన స్పాన్సర్డ్ ప్రాజెక్టులకు వివిధ జాతీయ, కార్పొరేట్ సంస్థలు నిధులు అందిస్తున్నాయన్నారు. ఈ సమావేశాల్లో ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రిటైర్డ్ ప్రొఫెసర్లు వీరరాఘవయ్య, జె.కృష్ణప్రసాద్, సీటీఆర్‌ఐ (ఐసీఏఆర్) వివిధ డివిజన్ల పూర్వ అధిపతులు సీవీఎన్ రావు, యు.శ్రీధర్, సీసీఎస్ రావు, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ ఆఫ్ అగ్రికల్చర్ జె.సత్యనారాయణ, ఇక్రిశాట్ ఇన్నోవేషన్స్ హబ్ అధిపతి ఆర్.శ్రీకాంత్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (సీఎస్‌ఐఆర్) చీఫ్ సైంటిస్ట్ బీవీ సుబ్బారెడ్డి, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ (ఐసీఏఆర్) ప్రధాన శాస్త్రవేత్త సీకే నారాయణ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ (ఐసీఏఆర్) పూర్వ డైరెక్టర్ ఎం.సుజాత, సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐసీఏఆర్) పూర్వ డైరెక్టర్ టీజీకే మూర్తి తదితరులు పాల్గొంటారని శేషుమాధవ్ వివరించారు.
అంతర్వేది క్షేత్రం.. భక్తజన సంద్రం
సఖినేటిపల్లి: లక్ష్మీనరసింహ స్వామివారు కొలువుదీరిన అంతర్వేది క్షేత్రం భక్తజన సంద్రంలా మారింది. కార్తిక మాసం ఆదివారం సెలవుదినం కావడంతో పిల్లాపాపలతో భక్తులు స్వామివారి దర్శనానికి భారీగా తరలివచ్చారు. అలాగే అయ్యప్ప, భవానీ మాలధారులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. పర్యాటకులు, భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. నిత్య నారసింహ సుదర్శన హోమాన్ని ఘనంగా నిర్వహించారు. నిత్యాన్నదాన పథకంలో భోజన వసతిని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ పర్యవేక్షించారు. క్యూలైన్ల ద్వారా స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది.
లోవలో భక్తుల సందడి
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వివిధ జిల్లాల నుంచి 4 వేల మంది భక్తులు రావడంతో లోవ దేవస్థానంలో ఆదివారం సందడి నెలకొంది. అమ్మవారిని దర్శించుకున్నారని ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్, దేవస్థానం కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. ప్రసాదాలు, పూజా టికెట్లు, విరాళాలు, తదితర విభాగాల ద్వారా రూ.1,91,811 ఆదాయం సమకూరింది.
Comments
Please login to add a commentAdd a comment