ఘనంగా ‘సాహితీ’ కార్తిక సమారాధన
కడియం: కార్తిక మాసం అనగానే మనకు నోరూరించే వంటకాలతో సహపంక్తి భోజనాలే గుర్తుకు వస్తాయి. ఆ విందు భోజనాలతో పాటు సాహితీ వంటకాలను కూడా వడ్డించారు కడియం గ్రామానికి చెందిన బోణం సత్యనారాయణ. ఆయన ఆదివారం స్థానిక తమ నర్సరీలో సాహితీ కార్తిక సమారాధన ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం నుంచి పలువురు కవులు, రచయితలు, పండితులను, వారితో పాటు స్థానిక చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి కళాసేవా సమితి సభ్యులను, హిందూ ధర్మ ప్రచార సమితి కార్యకర్తలను ఆహ్వానించి కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఆహూతులకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చిలుకూరి శ్రీనివాసరావు ఆహ్వానం పలుకగా, సాహిత్య సభకు బులుసు సత్యనారాయణమూర్తి అధ్యక్షత వహించారు. డాక్టర్ డి.నీలకంఠరావు పర్యవేక్షణలో జరిగిన ఈ సాహితీ సమ్మేళనంలో యాభై మంది కవులు తమ రచనలను వినిపించారు. కొందరు మహిళామణులు చక్కని గీతాలు ఆలపించారు. కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, కడియం ఉప సర్పంచ్ వెలుగుబంటి రఘురామ్‌లు హాజరై మాట్లాడారు. కవిత్వానికి ఆదరణ తగ్గిపోతున్న ఈ కాలంలో ఇలాంటి సమావేశాలు చాలా అవసరమన్నారు. దీనివల్ల ప్రజల్లో ఐకమత్యంతో పాటు సాహిత్యాభిలాష పెరుగుతుందని అన్నారు. నాయకులు అడపా సుబ్రహ్మణ్యం, ఆదిత్య కళాశాలల కరస్పాండెంట్ గంగిరెడ్డి, నాగిరెడ్డి, కొత్తూరి కృష్ణ, సుదర్శన్, ఖాదర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బోణం సత్యనారాయణ దంపతులను ఘనంగా సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment