రాష్ట్ర స్థాయి పోటీలకు గురుకులం విద్యార్థులు
అల్లవరం: ఉమ్మడి కృష్ణా జిల్లాలో మూడు రోజుల పాటు జరిగిన ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్లో అల్లవరం మండలం గోడి బాలుర గురుకులానికి చెందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ ఎన్.శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. సీనియర్ ఇంటర్ విద్యార్థి ఎస్.సతీష్‌కుమార్ జావెలిన్ త్రో, డిస్కస్ త్రో క్రీడల్లో ప్రథమ స్థానంలో నిలిచారు. డిస్కస్ త్రోలో కె.బాబీ ద్వితీయ స్థానం సాధించారు. జూనియర్స్ జావెలిన్ త్రో పోటీలో సీహెచ్ క్రాంతి కిరణ్ ప్రథమ స్థానం, హ్యాండ్ బాల్ విభాగంలో పదో తరగతికి చెందిన ప్రదీప్, క్రాంతికుమార్, అభిషేక్, గౌతమ్, చరణ్‌సాయి, సాత్విక్, వంశీలు విజేతలుగా నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విజేతలను ఉపాధ్యాయులు అభినందించారు.
రాష్ట్ర స్థాయి బాక్సింగ్
పోటీలకు పిఠాపురం బాక్సర్లు
పిఠాపురం: ఈ నెల 16వ తేదీన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా తాటిపాకలో నిర్వహించిన జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో పిఠాపురం క్రీడాకారులు విశేష ప్రతిభ కనబర్చినట్లు కోచ్ పి.లక్ష్మణరావు తెలిపారు. బాక్సింగ్ అండర్– 17 బాల బాలికల విభాగంలో పిఠాపురం లిటిల్ సోల్జర్స్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న బి.నాగరుతిక 46 కిలోల విభాగం, భాష్యం స్కూల్లో 9వ తరగతి చదువుతున్న జేఆర్ అరుణ్ 70 కిలోల విభాగంలో ప్రతిభ చాటారన్నారు. వీరిద్దరూ ఈ నెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకూ ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరగనున్న 68వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ బాక్సింగ్ పోటీలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పాల్గొంటారని కోచ్ పి.లక్ష్మణరావు తెలిపారు. ఎంపికై న బాక్సర్లను డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ బి.శ్రీనివాస్ కుమార్, కాకినాడ జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఎల్.జార్జ్ అభినందించారు.
లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
చాగల్లు: చాగల్లు మండలం దారవరంలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్టు ఎస్సై కె.నరేంద్ర తెలిపారు. నిడదవోలు మండలం సమిశ్రగూడెం ఎస్సీ బాలికల వసతి గృహంలో చదువుతున్న 14 ఏళ్ల బాలికపై వరుసకు మేనమామ అయిన పట్టెంపాలెం గ్రామానికి చెందిన సనమండ్ర కమల్ ఈ నెల 14న దారవరంలో లైంగిక దాడి చేశాడు. ఈ ఘటనలో నిందితుడైన కమల్‌ను ఆదివారం కొవ్వూరు డీఎస్పీ జి.దేవకుమార్ అరెస్టు చేసినట్టు ఎస్సై కె.నరేంద్ర తెలిపారు. నిందితుడిని నిడదవోలు కోర్టులో హాజరుపరిచామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment