బాలల హక్కులకు భంగం కలిగిస్తే చర్యలు
పిఠాపురం: బాలల హక్కులకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు టి.ఆదిలక్ష్మి అన్నారు. బాలల హక్కులు, ప్రజా చైతన్య వారోత్సవాల్లో భాగంగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో పిఠాపురంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఆదివారం విద్యార్థులకు బాలల హక్కులు, బాలల పరిరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ 1989లో బాలల హక్కులపై ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసిందన్నారు. బాలలకు జీవించే, అభివృద్ధి చెందే, రక్షణ పొందే, పాల్గొనే హక్కులు ఉన్నాయన్నారు. వీరిపై లైంగిక దాడులు జరగకుండా అందరూ బాధ్యత తీసుకోవాలన్నారు. బాలల హక్కులకు భంగం కలిగించినా, బాల్య వివాహాలు జరుగుతున్నా వాటిని నిలుపుదల చేయాలన్నారు. బాల్య వివాహాలకు సహకరించిన వారికి రూ.లక్ష జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు. బాలలు బడికి వెళ్లి చదువుకోవాలని, ఎన్నో మధుర జ్ఞాపకాలు మిగిల్చే బాల్యానికి మూడుముళ్ల బంధం వేయరాదన్నారు. బాల్య వివాహాలతో మాతా శిశు మరణాలు సంభవిస్తాయని, పౌష్టికాహార లోపం, రక్తహీనత వంటి సమస్యలు తలెత్తుతాయన్నారు. అమ్మాయిలు ప్రేమ పేరుతో మోసపోవద్దని, అపరిచితులు ఎవరైనా వెంబడిస్తే రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. బాల్య వివాహాలు, బాలల వేధింపులు, బాల కార్మికులు ఉంటే వెంటనే చైల్డ్‌లైన్ నంబరు 1098కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ చిన్నతనంలో బాల్య వివాహాలు చేసినా, ఎక్కడైనా భిక్షాటన చేస్తున్న పిల్లలు కనిపించినా చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలన్నారు. పిల్లలపై ఏవిధమైన అసభ్యకరమైన ఫొటోలు తీసి ఆన్‌లైన్లో పోస్టింగ్స్ పెట్టినా, ప్రేమ పేరుతో ఎవరైనా వేధించినా, మానసికంగా, శారీరకంగా వేధించినా తెలపాలన్నారు. కార్యక్రమంలో శిశు గృహ మేనేజర్ నూకరత్నం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment