వీధుల్లో పరుగెత్తిస్తున్నాయ్‌.. | - | Sakshi
Sakshi News home page

వీధుల్లో పరుగెత్తిస్తున్నాయ్‌..

Published Mon, Nov 18 2024 3:12 AM | Last Updated on Mon, Nov 18 2024 3:11 AM

వీధుల

వీధుల్లో పరుగెత్తిస్తున్నాయ్‌..

ఆలమూరు: ఏ ఊరు.. ఏ వీధి చూసినా కుక్కలే. గుంపులు గుంపులుగా తిరుగుతూ జనానికి దడ పుట్టిస్తున్నాయి. రోడ్డుపైకి రావాలంటే హడలెత్తేలా చేస్తున్నాయి. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత దయనీయంగా మార్చుతున్నాయి. ఏదైనా పనిపై బయటకు వెళ్లాలంటే చాలు వీధి కుక్కలు పరుగులు పెట్టిస్తున్నాయి. కుక్కల దాడి ఘటనలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెరిగిపోయాయి. నగరం, పట్టణం, గ్రామమనే తేడా లేకుండా గ్రామ సింహాలు దర్జాగా తిరుగుతున్నాయి. వీటి నియంత్రణకు ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకోకపోవడంతో రోజూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో అనేక కుక్కకాటు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వందల మంది క్షతగాత్రులవుతుండగా, పలువురు మృత్యువాత పడుతున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని వివిధ మండలాల్లో 385 గ్రామాలు, ఒక నగర పంచాయతీ, మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడ సుమారు 20 వేల వరకూ వీధి కుక్కలు ఉన్నట్లు పశుసంవర్థక శాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది. మండల పరిషత్‌ సమావేశాలు జరిపినప్పుడు ఈ వీధి కుక్కల బెడదపై ప్రత్యేకంగా చర్చిస్తున్నా ఫలితం ఉండడం లేదు. పంచాయతీరాజ్‌, పశుసంవర్ధక శాఖల మధ్య బాధ్యులు మీరంటే మీరంటూ ఒక్కోసారి వాదనకు దిగుతున్నారు. అప్పటికప్పుడు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సర్దిచెప్పి కుక్కల బెడద సమస్యను దాట వేయడం పరిపాటిగా మారింది. వీధి కుక్కల నియంత్రణకు మున్సిపాలిటీల్లో ప్రత్యేక వ్యవస్థ ఉండగా, గ్రామ పంచాయతీల్లో ఆ పరిస్థితి లేకపోవడంతో పాటు నిధుల లేమి వెంటాడుతోంది. కుక్కల సంతతి నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించకపోతే జనం భయంతో జీవనం సాగించాల్సిందే.

ఏం చేయాలంటే..

సాధారణంగా ఆడ కుక్కలు ఏడాదిలో రెండు సార్లు గర్భం దాల్చుతుంటాయి. ఒక ఆడ కుక్క ఒక్కో కాన్పులో సుమారు ఏడెనిమిది పిల్లలకు జన్మనిస్తుంది. దీంతో కుక్కల సంఖ్య ఏమాత్రం తగ్గకుండా ఏటా పెరిగిపోతూ వస్తుంది. కుక్కల సంతాన ఉత్పత్తి నియంత్రణ (యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌)తోనే వీధి కుక్కల బెడదను నివారించవచ్చని పశుసంవర్థక శాఖ చెబుతుంది. వీటి నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. గ్రామ పంచాయతీల్లో కాని, పురపాలక సంఘాల్లో కాని కుక్కలు ఎక్కడెక్కడ ఉంటాయో స్థానిక సంస్థల సిబ్బంది సహకారంతో గుర్తించాలి. కుక్కలు పట్టుకునే (డాగ్‌ క్యారియర్స్‌) వారిని నియమించుకుని, వాటికి ఏబీసీతో పాటు ఏఆర్‌వీ వ్యాక్సిన్‌ను అందించాలి. నగరాల్లో కొన్నిచోట్ల పశుసంవర్ధక శాఖ సిబ్బంది ఆయా ప్రాంతాలకు వెళ్లి కుక్కలకు యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ వేస్తున్నా గ్రామ పంచాయతీల్లో మాత్రం ఆ పరిస్థితి లేదు.

ఏఆర్‌వీ వ్యాక్సిన్‌ సురక్షితం

రేబిస్‌ లక్షణాలున్న కుక్కలు కరిచినప్పుడు ఆ వైరస్‌ ప్రభావం మనిషి కేంద్ర నాడీ వ్యవస్థపై పడుతుంది. ముఖం, వెన్నెముక భాగాల్లో కరిస్తే వైరస్‌ నాడీ వ్యవస్థకు వేగంగా వ్యాపిస్తుంది. కాలు, తొడ, చేయి భాగాలపై కరిచినప్పుడు కొంత ఆలస్యంగా వైరస్‌ నాడీ వ్యవస్థను చేరుకుంటుంది. రేబిస్‌ లక్షణాలు బయటపడిన తర్వాత నయం చేయడానికి ఎలాంటి వైద్యం లేదు. వ్యాధి కారక లీసా వైరస్‌ కుక్కల్లోనే కాకుండా పిల్లులు, నక్కలు, గబ్బిలాల్లోనూ ఉంటుంది. ఏది కరిచినా వెంటనే టీటీ ఇంజక్షన్‌ చేయించుకోవాలి. వీటి దాడిలో తీవ్ర గాయాలైన క్షతగాత్రులు సత్వరమే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ (ఏఆర్‌వీ) తీసుకోవాలి. గాయాల తీవ్రత ఎక్కువ ఉన్నవారు మెరుగైన ప్రత్యేక చికిత్స తీసుకోవడం ద్వారా ప్రాణాప్రాయ పరిస్థితిని తప్పించుకోవచ్చు. చికిత్స విధానంలో నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు. పెంపుడు కుక్కల యజమానులు వాటికి పుట్టిన నెల రోజుల వ్యవధిలో యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ వేయించాలి. నెల తర్వాత బూస్టర్‌ డోస్‌ వేయించుకుంటే రేబిస్‌ వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు.

జిల్లాలో ఐదేళ్లలో కుక్కకాటు కేసులు

2019–20 : 18,958

2020–21 : 19,698

2021–22 : 20,878

2022–23 : 24,297

2023–24 : 27,312

(2024 అక్టోబర్‌ 31 వరకూ)

పెరిగిన వీధి కుక్కల దాడులు

నియంత్రణకు ప్రభుత్వ చర్యలు శూన్యం

రెండు శాఖల మధ్య సమన్వయ లోపం

ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు

వీధి కుక్కల సంతానోత్పత్తి నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. జిల్లా కేంద్రమైన ఆమలాపురంలో కుక్కల నియంత్రణకు సంబంధించి కార్యాలయం ఏర్పాటు చేశాం. పంచాయతీరాజ్‌, పురపాలక సంఘ అధికారులతో కలిసి సమర్థవంతంగా కుక్కల నియంత్రణకు ఏబీసీ వ్యాక్సిన్‌ అందేలా చర్యలు తీసుకుంటాం.

– కె.వెంకట్రావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి

రేబిస్‌ కుక్క లక్షణాలు

రేబిస్‌ లక్షణాలున్న కుక్కలు విచిత్రంగా ప్రవరిస్తాయని పశు వైద్యాశాఖ నిపుణులు చెబుతున్నారు. అలాంటి కుక్క వింతగా ప్రవర్తించడం, ఉద్రేకంగా కనిపించడం, నోటి నుంచి ఎక్కువగా చొంగ కారడం వంటి లక్షణాలు ఉంటాయి. మానవులైనా, జంతువులైనా దూకుడుగా వెళ్లి దాడి చేయడానికి చూస్తుంది. చలనం లేని వస్తువులను కరవడం వంటి లక్షణాలు 90 శాతం రేబిస్‌ కుక్కలలో ఉండే అవకాశం ఉంది. ఇలాంటి లక్షణాలు లేకుండానే మరికొన్ని నీరసంగా నిర్లిప్తంగా ఉంటాయి. ఎటువంటి ఆహారాన్ని తీసుకోవు. రెండు, మూడు రోజుల తర్వాత చనిపోతాయి. ఈ కుక్కలు కరిస్తే వెంటనే చికిత్స చేయించుకోవాలి.

చికిత్సా విధానం ఇలా..

ఏ కుక్క కరిచినా వెంటనే గాయాన్ని డెటాల్‌, స్పిరిట్‌, సబ్బుతో శుభ్రం చేయాలి. గాయంలో ఉన్న వైరస్‌ను నిర్మూలించడానికి కార్బలిక్‌ యాసిడ్‌ ఉపయోగపడుతుంది. కుక్క కరిచిన భాగాన్ని వేగంగా నీళ్లు వచ్చే కుళాయి కింద ఉంచాలి. రక్తం బయటకు పోయేలా కాటు పడిన భాగం వద్ద గట్టిగా నొక్కాలి. శుభ్రం చేసిన తర్వాత పది నిమిషాలు ఎండ తగిలేలా ఉంచాలి. కుక్క కాటు వేసిన రోజు నుంచి దశల వారీగా ఏఆర్‌వీ ఇంజక్షన్‌ చేయించుకోవాలి. గాయమైన రోజున తొలి డోసు వేయించుకోవాలి. 3, 7, 14, 21వ రోజున తిరిగి ఇంజక్షన్‌ తీసుకోవాలి. గాయమైన 90వ రోజున కూడా ఈ ఇంజక్షన్‌్‌ తీసుకుంటే చక్కని ఫలితం ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
వీధుల్లో పరుగెత్తిస్తున్నాయ్‌..1
1/3

వీధుల్లో పరుగెత్తిస్తున్నాయ్‌..

వీధుల్లో పరుగెత్తిస్తున్నాయ్‌..2
2/3

వీధుల్లో పరుగెత్తిస్తున్నాయ్‌..

వీధుల్లో పరుగెత్తిస్తున్నాయ్‌..3
3/3

వీధుల్లో పరుగెత్తిస్తున్నాయ్‌..

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement