రత్నగిరిపై భక్తజనవాహిని●
● సత్యదేవుని దర్శించిన 80 వేల మంది
● వ్రతాలు 7,904
● ఆదాయం రూ.80 లక్షలు
అన్నవరం: రత్నగిరికి ఆదివారం భక్తజనవాహిని పోటెత్తింది. సత్యదేవుని దర్శనానికి వేలాదిగా భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణంలో తీవ్ర రద్దీ ఏర్పడింది. దీంతో పశ్చిమ రాజగోపురం వద్దనే భక్తులను కంపార్ట్‌మెంట్లలో నిలిపివేసి, బృందాల వారీగా స్వామివారి దర్శనానికి అనుమతించారు. సుమారు 80 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించినట్లు అధికారులు అంచనా వేశారు. సత్యదేవుని ఆలయం, ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారి ఆలయాన్ని తెల్లవారుజామున రెండు గంటలకు తెరచి పూజలు చేశారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి వ్రతాలు నిర్వహించారు. అప్పటి నుంచి సాయంత్రం 4 గంటల వరకూ దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. సత్యదేవుని ఉచిత దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో అంతరాలయం దర్శనాన్ని నిలిపివేసి, భక్తులను వెలుపల నుంచి అనుమతించారు. అలాగే, యంత్రాలయం లోపలకు కూడా అనుమతించకుండా బయటి నుంచే దర్శనాలు కల్పించారు. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. సత్యదేవుని వ్రతాలు 7,904 జరిగాయి. వీటిలో రూ.300 టికెట్టుతో 6 వేలు, రూ.వెయ్యి, రూ.1,500, రూ.2 వేల టికెట్టు వ్రతాలు 1,904 జరిగాయి. వ్రతాల ద్వారానే దేవస్థానానికి రూ.45 లక్షల ఆదాయం సమకూరింది. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి మొత్తం రూ.80 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. అన్నదాన పథకంలో 8 వేల మంది భక్తులకు పులిహోర, దద్ధోజనం, వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఏర్పాట్లను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ రామచంద్ర మోహన్ పర్యవేక్షించారు.
నేడు కూడా రద్దీ!
కార్తిక మాసం మూడో సోమవారం పర్వదినం కావడంతో రత్నగిరిపై తీవ్ర రద్దీ నెలకొనే అవకాశం ఉంది. సుమారు లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment