వేమగిరి ర్యాంపులో రాత్రి వేళ ఇసుక తవ్వకాలు
కడియం: కూటమి ప్రభుత్వం హయాంలో చెప్పేదానికి.. చేసేదానికి పొంతన ఉండదని మరోసారి తేటతెల్లమైంది. స్వయంగా జిల్లా కలెక్టరే వచ్చి ఇసుక అక్రమాలు చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రెండు రోజులు కూడా కాకుండానే.. మండలంలోని వేమగిరి – బుర్రిలంక ర్యాంపులో ఇసుక దోపిడీకి ఆదివారం రాత్రి తెర తీశారు. సాయంత్రం ఆరు గంటలకల్లా భారీ జేసీబీలు, లారీలతో ఇసుక అక్రమార్కులు ర్యాంపులోకి ప్రవేశించి, విచ్చలవిడిగా ఇసుక దోపిడీ మొదలు పెట్టారు. సాయంత్రం ఆరు గంటలు దాటిన తరువాత ఇసుక తవ్వకాలు సాగించరాదనే నిబంధనలున్నప్పటికీ అధికార యంత్రాంగం మౌనం వహించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
వేమగిరి–1 ఇసుక ర్యాంపుకు సంబంధించి చోటు చేసుకున్న న్యాయపరమైన వివాదమే ఈ దోపిడీకి కారణమైందని అంటున్నారు. ఈ ర్యాంపును టెండర్లలో తొలుత ఓ సంస్థ దక్కించుకుంది. కొన్ని సాంకేతిక కారణాలతో అధికారులు ఆ సంస్థ అనుమతిని రద్దు చేశారు. అయితే టెక్నికల్ బిడ్, ఫైనాన్షియల్ బిడ్ పరిశీలించి, లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సీ ఇచ్చి, ఈఎండీ కట్టించుకుని, అగ్రిమెంట్ కూడా చేసిన తరువాత ఎలా రద్దు చేస్తారంటూ మొదటి కాంట్రాక్టర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయనకు అనుకూలంగా హైకోర్టు శుక్రవారం స్టే మంజూరు చేసినట్లు చెబుతున్నారు. ఈ స్టే ఉత్తర్వులు అధికారులకు సోమవారం చేరే అవకాశం ఉంది. ఈలోగా టెండర్లలో ఎల్–2గా వచ్చిన కాంట్రాక్టు సంస్థ తరఫున అమలాపురానికి చెందిన ఒక కాంట్రాక్టర్ రంగంలోకి దిగి, వేమగిరి ర్యాంపులో అక్రమ తవ్వకాలకు తెర తీశారని అంటున్నారు. ఎల్–1 కాంట్రాక్టర్‌ను రద్దు చేయడంతో తమకు అనుమతిచ్చారంటూ ఎల్–2 కాంట్రాక్టర్ ఇసుక తవ్వకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. రాత్రంతా ఇసుక తవ్వకాలు జరిపేలా సదరు కాంట్రాక్టర్ భారీ యంత్రాలతో ర్యాంపులో పక్కా ఏర్పాట్లు చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment