నర్సింగ్ పోస్టుల భర్తీ వ్యవహారంలో మలుపులు
● తనకేమీ తెలియదన్న జీజీహెచ్ మేనేజర్
● ఏకంగా కలెక్టరేట్ పైనే ఆరోపణలు
● దీనిపై కలెక్టర్ సీరియస్
● విచారణ పూర్తి.. త్వరలో తదుపరి చర్యలు
కాకినాడ క్రైం: కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో 2020లో కాకినాడ ప్రభుత్వాస్పత్రి(జీజీహెచ్)లో జరిగిన నర్సింగ్ పోస్టుల భర్తీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆ ఏడాది జూన్‌లో 278 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా డిసెంబర్‌లో నియామకాలు జరిగాయి. ఇందులో జీజీహెచ్ మేనేజర్ వైవీఎస్‌ఎన్ నరసింగరావు అప్పటి కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించి, అర్హులను పక్కన పెట్టి, లంచాలు తీసుకుని, అనర్హులకు పోస్టులు అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణకు డిప్యూటీ కలెక్టర్, జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ ఆర్.శ్రీధర్ చైర్మన్‌గా ప్రస్తుత కలెక్టర్ షణ్మోహన్ సగిలి కమిటీని నియమించారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన కమిటీ తుది నివేదికను ఇటీవల కలెక్టర్‌కు అందజేసింది. ఈలోగా నరసింగరావుపై కలెక్టర్‌కు ఓ అభ్యర్థి గత సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. నరసింగరావు నిర్వాకంతో తాను ఉద్యోగం పొందలేకపోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ, అర్హులైన తనవంటి బాధిత అభ్యర్థుల పేర్లను కలెక్టర్‌కు అందజేసింది. ఉద్యోగం పొందేందుకు అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ తమకు అన్యాయం జరిగిందని, విచారణలో వెల్లడయ్యే వాస్తవాల ఆధారంగా తనకు ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని అభ్యర్థించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పూర్తి చేసిన విచారణకు అనుబంధంగా తాజా ఫిర్యాదుపై కూడా విచారణ జరపాలని, రెండింటికీ కలిపి ఉమ్మడిగా సోమవారం నాటికి తనకు తుది నివేదిక అందించాలని కమిటీ చైర్మన్ శ్రీధర్‌ను కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. మరోవైపు నరసింగరావు తన అనుయాయులతో తమను బెదిరిస్తున్నారని విచారణ బృందం కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లింది. దీంతో ఈ మొత్తం వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ విచారణ కమిటీని ప్రభావితం చేస్తున్న వారి పేర్లు, పూర్తి వివరాలు తనకు ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. ఇదిలా ఉండగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నరసింగరావు తన అనుచరులతో కలిసి ఇటీవల కలెక్టర్ షణ్మోహన్‌ను కలిశారు. తాను అమాయకుడినని, తనకేమీ తెలియదని పేర్కొన్నారు. నర్సింగ్ పోస్టుల విక్రయాల్లో అప్పటి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సహా కలెక్టరేట్ సిబ్బంది ప్రమేయం ఉందనే రీతిలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఏకంగా కలెక్టరేట్ పైనే ఆరోపణలు చేయడాన్ని కలెక్టర్ షణ్మోహన్ తీవ్రంగా పరిగణించారు. దీనిపై విచారణ జరిపి త్వరితగతిన తనకు తుది నివేదిక ఇవ్వాలని విచారణ కమిటీని ఆదేశించారు. ఈ మేరకు కమిటీ శుక్రవారం నాటికే విచారణ పూర్తి చేసి కలెక్టర్‌కు తుది నివేదికను అందించింది. దీనిలోని కీలక అంశాలను ప్రాథమికంగా పరిశీలించిన కలెక్టర్.. నర్సింగ్ పోస్టుల విక్రయాల్లో కలెక్టరేట్ ప్రమేయం ఏమాత్రం లేదని స్పష్టతకు వచ్చారు. ఏకంగా కలెక్టరేట్ పైనే బురద జల్లేందుకు నరసింగరావు ప్రయత్నించడాన్ని తీవ్రంగా పరిగణించారు. నర్సింగ్ పోస్టుల విక్రయాల ఆరోపణలపై విచారణ అత్యంత పారదర్శకంగా జరిగిందని, కలెక్టరేట్‌పై జీజీహెచ్ మేనేజర్ చేసిన ఆరోపణల్లో వాస్తవాలు లేవని కలెక్టర్ షణ్మోహన్ స్పష్టం చేశారు. నివేదికలోని అంశాల ఆధారంగా త్వరలో తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment