ఆయ్.. రారండోయ్..
కోరంగి.. మనసు ఉప్పొంగి
కాకినాడ జిల్లా కోరంగి అభయారణ్యానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ మడ అడవులను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. మడ అడవుల మధ్యలో నుంచి చెక్కల వంతెనల మీదుగా నడుస్తూ ప్రకృతి అందాలను తిలకించడం కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ రకరకాల పక్షులు, నీటి పిల్లులు, వివిధ జంతువులు ఆకర్షిస్తున్నాయి. కుటుంబ సమేతంగా వెళ్లేందుకు ఇక్కడ బోట్లు ఏర్పాటు చేశారు. సాధారణ రోజుల్లో వెయ్యి, సెలవు దినాల్లో సుమారు రెండు వేల మంది వరకూ వస్తుంటారు. ఇక్కడి విశేషాలను తెలిపేలా మినీ థియేటర్ కూడా ఏర్పాటు చేశారు.
● ప్రకృతి శిల్పం.. కోనసీమ ప్రాంతం
● ఆధ్యాత్మిక, ఆహ్లాద కేంద్రంగా జిల్లా
● కార్తికంలో వన భోజనాలకు ప్రత్యేకం
● పర్యాటకుల సందడితో కళకళ
ఆలమూరు/ సఖినేటిపల్లి/ మలికిపురం/ అల్లవరం/ తాళ్లరేవు: ప్రకృతి చెక్కిన శిల్పం కోనసీమ ప్రాంతం.. ఎన్నో అందాలు దీని సొంతం.. స్వర్గసీమను తలపించే పచ్చదనం ఇక్కడ ప్రత్యేకం.. ఈ జిల్లా ఆతిథ్య, ఆధ్యాత్మిక, ఆనందానికి కేంద్రం.. అలాంటి సీమను చూసేందుకు రెండు కనులూ చాలవు. సరిపోవు. అందుకే కార్తిక మాసంలో ఇక్కడి అందాలను తిలకించేందుకు పర్యాటకులు తరలి వస్తుంటారు.. గలగల పారే గోదావరి.. పచ్చని పైర్లు.. కొబ్బరి తోటలు.. ఒంపులు తిరుగుతూ వెళ్లే కాలువలు.. సాగర తీర ప్రాంతాలు.. ఆధ్యాత్మిక పంచే పుణ్యక్షేత్రాలు ఇక్కడ ప్రత్యేకం. కోనసీమ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయ్ రారండోయ్ అంటూ పిలుస్తున్న జిల్లా గురించి తెలుసుకుందాం రండి..
శివకేశవులకు ఎంతో ప్రీతికర మాసం కార్తికం. ప్రతి ఒక్కరి మనసుకు ఆహ్లాదం, ఆనందం, ఆధ్యాత్మికతను పంచే ఈ మాసంలో ప్రకృతి ఒడిలో ఒదిగిపోవాలని అందరూ భావిస్తుంటారు. అలాంటి వారికి జిల్లా ఆతిథ్యాన్ని అందిస్తోంది. ప్రధానంగా ఆధ్యాత్మికంగా జిల్లాలో రామచంద్రపురం మండలం ద్రాక్షారామలో శ్రీపార్వతీ సమేత భీమేశ్వరస్వామి ఆలయం, కొత్తపేట మండలం పలివెలలో పురాణ ప్రసిద్ధి గాంచిన ఉమా సమేత కొప్పేశ్వరస్వామి, మురమళ్లలో భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి, ఆలమూరులో శతాబ్దాల చరిత్ర కలిగిన విక్రమ భట్టీశ్వరస్వామి ఆలయం, పెనికేరులో వెలసిన ఇష్ట కాంతేశ్వరస్వామి, కోటిపల్లిలో విశ్వేశ్వరస్వామి, జొన్నాడలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన కాశీ అన్నపూర్ణా సమేత శ్రీవిశ్వేశ్వర స్వామి తదితర శైవక్షేత్రాలు పేరుగాంచాయి. ఇక్కడ కార్తికంలో ప్రతి సోమవారం భక్తుల రద్దీ ఉంటోంది.
పర్యాటకం... ప్రత్యేకం
జిల్లాలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడి గోదావరి అందాలతో పాటు సాగర తీర ప్రాంతాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. సఖినేటిపల్లి మండలంలో అంతర్వేది సాగర సంగమం, మలికిపురం మండలంలో కేశనపల్లి, తూర్పుపాలెం, ఉప్పలగుప్తం మండలంలో ఎస్.యానాం, అల్లవరం మండలంలో ఓడలరేవు తదితర బీచ్‌లు పర్యాటకులతో కళకళలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది ఇక్కడకు వచ్చి సరదాగా గడుపుతున్నారు. ఆయా బీచ్‌ల సమీపంలోని సరుగుడు తోటల్లో వన సమారాధనలు ఏర్పాటు చేసుకుని ఆటపాటలతో సందడి చేస్తున్నారు. దీంతో పాటు గౌతమీ, వశిష్ట, వైనతేయ నదీ తీరాల వెంబడి ఉన్న ప్రదేశాలను పర్యాటకులు సందర్శిస్తున్నారు. ఆత్రేయపురం మండలంలో లొల్ల లాకులు, కపిలేశ్వరపురం మండలం కేదార్లంకలో ధనమ్మమర్రి, మండపేట మండలం కేశవరంలో గనిపోతురాజు ఆలయం, రాయవరం మండలం సోమేశ్వరంలో చిన తలుపులమ్మ లోవ ఆధ్యాత్మికతతో పాటు వన భోజనాలకు వేదికలవుతున్నాయి. ఆలమూరు మండలం బడుగువానిలంకలో ఆదివారం జరిగిన యెరుబండి వంశీయుల వన సమారాధనలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు మూడు వేల మంది హాజరయ్యారు. ఆటపాటలతో సందడి చేశారు.
దిండి.. పదండి
మలికిపురం మండలం దిండి రిసార్ట్స్‌కు రాష్ట వ్యాప్తంగా పేరుంది. ఇది పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఇక్కడ హౌస్ బోట్లు, ఫాంటూస్ బోట్లు గోదావరిలో షికారుకు ఏర్పాటు చేశారు. స్విమ్మింగ్ ఫూల్స్, రిసార్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రోజుకు వెయ్యి మందికి పైగా ఇక్కడకు వచ్చి ప్రకృతి అందాలకు మంత్రముగ్ధులవుతున్నారు. దేశ, విదేశాల నుంచి పర్యాటకులు రావడం విశేషం. అంతేకాకుండా ఇక్కడ అనేక సినిమాలు చిత్రీకరించారు.
అంతర్వేది.. ఆహ్లాదానికి విడిది
అంతర్వేది పుణ్యక్షేత్రం లక్ష్మీనృసింహుడు కొలువుదీరిన ప్రాంతం. ఇక్కడ ఆధ్యాత్మికత వెల్లివిరిస్తోంది. అలాగే అంతర్వేది బీచ్, సాగర సంగమ ప్రాంతం పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. ఈ కార్తికంలో మరింత రద్దీగా మారుతోంది. శని, ఆదివారాల్లో సుమారు పది వేల నుంచి 20 వేల మంది వరకూ భక్తులు, పర్యాటకులు రావడం విశేషం. ఇక్కడ అటు భక్తిభావం, ఇటు ఆహ్లాదం కట్టిపడేస్తోంది. సముద్రంలో పిల్లాపాపలతో స్నానాలు చేస్తూ కేరింతలు కొట్టే యువత రోజురోజుకూ పెరుగుతోంది.
తీరం.. ఆనంద సాగరం
అల్లవరం మండలం ఓడలరేవు సముద్ర తీరం పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తోంది. ఇక్కడ పిల్లా పాపలతో సముద్రంలో స్నానాలు ఆచరించి సకుటుంబ సమేతంగా సరుగుడు తోటల్లో కార్తిక వన భోజనాలు చేసుకుంటున్నారు. సాయం సంధ్యా సమయం వరకూ ఉండి జీవితంలో మధుర క్షణాలను లిఖించుకుంటున్నారు. వేలాదిగా వచ్చే పర్యాటకుల దృష్ట్యా తీరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment