ఎస్సీ ప్రాంతాల్లో నిర్బంధంగా విద్యుత్ బిల్లుల వసూళ్లు
కట్టకపోతే కరెంట్ కట్
రౌతులపూడి: మండలంలోని పలు గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో గృహ విద్యుత్ బిల్లుల నిర్బంధ వసూలుకు అధికారులు శ్రీకారం చుట్టారు. శుక్రవారం మండలంలోని ఎ.మల్లవరం, బీబీ పట్నం తదితర గ్రామాల్లో విద్యుత్ అధికారులు ఎస్సీ గృహవిద్యుత్ వినియోగదారులు ఇళ్లు సందర్శించి నిర్బంధంగా వసూళ్లు చేపట్టారు. రూ.ఐదు వేలుకు పైగా విద్యుత్ బిల్లులు ఉన్న గృహవినియోగదారుల నుంచి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా విద్యుత్ బిల్లుల మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని విద్యుత్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని వినియోగదారులు లబోదిబోమంటున్నారు. గత ప్రభుత్వం హయాంలో ఐదేళ్లు ఒక్క రూపాయి కూడా విద్యుత్ బిల్లులు చెల్లించలేదన్నారు. ఒకేసారి ఆ మొత్తాన్ని చెల్లించాలని, లేకుంటే విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తామని అధికారులు హుకుం జారీచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీనాలీ చేసుకుని జీవనం సాగించే తాము అధిక మొత్తంలో విద్యుత్ బిల్లులు ఎలా చెల్లించాలని వారు వాపోతున్నారు. కనీసం వాయిదాల పద్ధతిలో నెలనెలా చెల్లించే అవకాశం కల్పించాలని కోరినా పట్టించుకోవడం లేదన్నారు. ఇలా నిర్ధాక్షిణ్యంగా విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తే తామంతా చీకట్లోనే జీవించే పరిస్థితి దాపురిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
కనెక్షన్లు తొలగించారంటూ నిరసన
తొండంగి: మండలంలోని గోపాలపట్నం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద తొండంగికి చెందిన వినియోగదారులు తమ విద్యుత్ కనెక్షన్లు తొలగించారని శుక్రవారం నిరసన తెలిపారు. బాధితుల వివరాల ప్రకారం తొండంగి ఎస్సీపేటకు చెందిన 20 విద్యుత్ వినియోగదారుల విద్యుత్ కనెక్షన్లను విద్యుత్‌శాఖ అధికారులు తొలగించారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తొలగించడంపై విద్యుత్‌శాఖ సిబ్బంది తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సబ్‌స్టేషన్ వద్ద వినియోగదారులు నిరనన తెలిపారు. అయితే పాతబకాయిల కారణంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కనెక్షన్లు సిబ్బంది తొలగించారని విద్యుత్ శాఖ ఏఈ ప్రసాద్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో బకాయిల చెల్లింపునకు 20 రోజుల గడువు ఇవ్వడంతోపాటు విద్యుత్ కనెక్షన్లను పునరుద్ధరించేందుకు అంగీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment