విత్తు లేక నత్తనడక
రబీలో బొండాలకు క్రేజ్
రబీలో బొండాల రకాలకు క్రేజ్ అధికం. కనీస మద్దతు ధర కన్నా అదనంగా బస్తాకు రూ.200 నుంచి రూ.400 వరకు అదనంగా ధర వచ్చిన సందర్భాలు సైతం ఉన్నాయి. గత ఏడాది బస్తా కనీస మద్దతు ధర రూ.1,637 కాగా, బొండాలకు ఒక సందర్భంలో రూ.1,900 వరకు ధర వచ్చింది. ఈ కారణంగా రైతులు ఈ రకానికి మొగ్గు చూపుతున్నారు. తొలి పంట సాగు చేయకపోవడం, చేసిన చోట సరైన దిగుబడి రాకపోవడం వల్ల పెద్దగా లాభాలు పొందని రైతులు బొండాల సాగు చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఈ రకం విత్తనాల కొరత వల్ల వారు ఆందోళన చెందుతున్నారు. విత్తన కొరత రబీ ఆలస్యానికి కారణమవుతోంది.
సాక్షి, అమలాపురం: డెల్టా రైతుల ఆశల సాగు రబీకి అడుగడుగునా అవాంతరాలు ఏర్పడుతున్నాయి. వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు విత్తన కొరత తోడయ్యింది. అధిక దిగుబడులందించే ‘బొండాల’ రకాల విత్తనాలు రైతులకు మార్కెట్‌లో దొరకడం లేదు. ఇది రబీసాగు నత్తనడకకు కారణమవుతోంది.
డెల్టాలో రబీలో పెద్ద ఎత్తున సాగు చేసే బొండాల రకాల విత్తనాలకు కొరత ఏర్పడింది. ప్రభుత్వం రబీలో బొండాల రకం సాగు వద్దంటున్నా రైతులు వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాతో పాటు తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల పరిధిలో ఉన్న తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలలో సుమారు 4.3 లక్షల ఎకరాల్లో రబీ వరిసాగు జరుగుతోందని అంచనా. కోనసీమ, కాకినాడ జిల్లాలతో పోలిస్తే తూర్పు గోదావరి జిల్లాలో అనపర్తి వ్యవసాయ సబ్ డివిజన్‌లో మినహా మిగిలిన ప్రాంతాల్లో బొండాల కన్నా ఆర్‌ఎన్‌ఆర్ హై క్వాలిటీని అధికంగా సాగు చేస్తారు. కోనసీమ జిల్లా పరిధిలో తూర్పు డెల్టాలో ఆలమూరు, రామచంద్రపురాల్లో అధికంగాను, మధ్య డెల్టా పరిధిలో కొత్తపేట, అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలో 50 శాతం ఈ రకం సాగు చేస్తారు. గతంలో మధ్య డెల్టాలో చాలా తక్కువగా బొండాలు సాగు చేసేవారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కన్నా బహిరంగ మార్కెట్‌లో అధిక ధరకు బొండాల ధాన్యం కొనుగోలు చేయడంతో రైతులు సైతం పెద్ద ఎత్తున ఈ రకం సాగుకు మొగ్గు చూపుతున్నారు. కాకినాడ జిల్లాలో కాజులూరు, కరప వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో బొండాలు సాగు అధికం. ఇక్కడ ప్రాంతాన్ని బట్టి 70 శాతం నుంచి 80 శాతం వరకు ఈ రకాన్ని సాగు చేస్తారు.
గతంలో ఎంటీయూ – 3626 రకాన్ని అధికంగా సాగు చేసేవారు. గత రెండు, మూడు దఫాలుగా ఈ రాకానికి తెగుళ్లు, పురుగులు అధికంగా వస్తున్నాయి. సగటు దిగుబడి 55 బస్తాల నుంచి 45 బస్తాలకు తగ్గింది. దీంతో రైతులు ప్రత్యామ్నాయ రకాల బొండాలను సాగు చేస్తున్నారు. దీంతో పాటు ఒక ప్రముఖ ప్రైవేట్ కంపెనీకి చెందిన బొండాల రకం విత్తనాల లభ్యత ఉన్నా రైతులు దానికి దూరంగా ఉంటున్నారు. ఈ రకం సగటు దిగుబడి 55 బస్తాలకు పైగా ఉన్నప్పటికీ ఈ ఏడాది మొలక శాతం 60 శాతం మించడం లేదని రైతులు చెబుతున్నారు. దీనికి తోడు వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల మరికొంత మొలక దెబ్బతినడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఒడిశా రకం బొండాల విత్తనాల లభ్యత ఉన్నప్పటికీ ఇది తూర్పు డెల్టాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే లభ్యమవుతోంది.
కిలో విత్తనం రూ.100
ఎంటీయూ–3626తో పాటు ప్రైవేట్ రకాల బొండాలను ప్రభుత్వం విక్రయించదు. ప్రైవేట్ కంపెనీలతో పాటు రైతుల వద్ద నుంచి ఈ విత్తనాలను సేకరిస్తారు. ఖరీఫ్ భారీ వర్షాల వల్ల విత్తనాల చేలు దెబ్బతినడం వల్ల ఇప్పుడు ఈ కొరత ఏర్పడింది. దీనిని ఆసరాగా చేసుకుని గతంలో 30 కేజీల విత్తనం రూ.వెయ్యి ధరను ఇప్పడు ఏకంగా రూ.మూడు వేలు చేశారు. దీంతో కేజీ విత్తనం ధర రూ.100 వరకు ఉండడం గమనార్హం. హైబ్రీడ్ బొండాల విత్తనం ధర సైతం అధికంగానే ఉంది. ఈ రేటుకు కొందామన్నా అందుబాటలో విత్తనం లేకుండా పోయింది. వ్యవసాయ శాఖ అధికారులు డెల్టాలో ఎంటీయూ – 1121 రకాన్ని సాగు చేయాలని సూచిస్తున్నారు.
బొండాలు రకం విత్తనాలకు తీవ్ర కొరత
ఆ ధాన్యం కొనుగోలుకు
ప్రభుత్వం ససేమిరా
డెల్టాల్లో 4.30 లక్షల ఎకరాల్లో సాగు
ఇటీవల ఆ తీరంలో తగ్గిపోతున్న దిగుబడి
గతంలో ఎంటీయూ– 3626కు డిమాండ్
ఈసారి ప్రైవేట్ రకంలో
తగ్గిన మొలక శాతం
Comments
Please login to add a commentAdd a comment