రబీపైనే ఆశలు | - | Sakshi
Sakshi News home page

రబీపైనే ఆశలు

Published Thu, Jan 9 2025 12:22 AM | Last Updated on Thu, Jan 9 2025 12:22 AM

రబీపైనే ఆశలు

రబీపైనే ఆశలు

సాక్షి, రాజమహేంద్రవరం: రైతుల ఆశలపై ఖరీఫ్‌ నీళ్లు చల్లింది. వరి పంట సాగు ఆరంభంలో వాతావరణం అనుకూలించడంతో ఉత్సాహంగా సాగు చేపట్టారు. జోరుగా పంటల సాగు చేపట్టారు. చిరుపొట్ట దశలో భారీ వర్షాలు కురవడం, గింజ గట్టిపడే సమయంలో కొంతమేర తెగుళ్లు వ్యాప్తి చెందడంతో ధాన్యం దిగుబడి గణనీయంగా తగ్గింది. ఈ విపత్తు నుంచి ఎలాగోలా గట్టెక్కామని భావిస్తున్న తరుణంలో ఫెంగల్‌ తుపాను రైతులను కలవరపాటుకు గురిచేసింది. వెరసి ఖరీఫ్‌ సీజన్‌ చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఖరీఫ్‌లో నష్టాన్ని రబీలోనైనా భర్తీ చేసుకోవాలన్న ఉద్దేశంతో కోటి ఆశలతో కాడిపడుతున్నారు. ఈ పంటైనా కలిసిరావాలని కోరుకుంటూ వరి సాగుకు ఉపక్రమించారు. వరినాట్ల ప్రక్రియ ప్రారంభించారు. కొన్ని ప్రాంతాల్లో విస్తృతంగా నారుమళ్లు పోస్తున్నారు. ప్రస్తుతం నీటితో పంటలకు అంతమేర అవసరం లేకపోవడంతో సాగుకు సై అంటున్నారు.

21,596 హెక్టార్లలో వరినాట్లు

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఒకవైపు నారుమళ్ల ప్రక్రియ సాగుతుంటే.. మరోవైపు నాట్లు ము మ్మరంగా జరుగుతున్నాయి. వెదజల్లే, సాధారణ పద్ధతుల్లో నాట్లు వేయడంలో రైతులు తలమునకలవుతున్నారు. జిల్లాలో 4,102 హెక్టార్లలో వెదజల్లు, 17,494 హెక్టార్లలో సాధారణ పద్ధతిలో నాట్లు వేసి నట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తు న్నాయి. 35.97 శాతం నాట్లు పూర్తయ్యాయి. రాజమహేంద్రవరం అర్బన్‌లో 85.93 శాతం, చాగల్లు 72.14, సీతానగరం 51.89, బిక్కవోలు 59.42, రాజానగరం 51,31, కడియం 44.08, అనపర్తి 47.17, రంగంపేటలో 56.15 శాతం నాట్లు వేసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. మిగిలినవి సైతం త్వరితగతిన పూర్తి చేసేందుకు రైతులు శ్రమిస్తున్నారు.

4,102 హెక్టార్లలో వెదజల్లు

వరి సాగులో ‘వెదజల్లే’ విధానానికి ఆదరణ దక్కుతోంది. పరిమితంగా సాగు వ్యయం, కూలీల ఖర్చులు తగ్గుతుండటం, నీటి తడులు ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం లేకపోవడంతో ఈ విధానంలో సాగు చేసేందుకు రైతులు మక్కువ చూపుతున్నారు. ఖరీఫ్‌, రబీ ఇలా సీజన్‌ ఏదైనా వెదకే రైతులు ఓటు వేస్తున్నారు. డెల్టా, మెట్ట ప్రాంతాలన్న భేదం లేకుండా ఈ సాగు పద్ధతి ఎవర్‌గ్రీన్‌గా వెలుగొందుతోంది. జిల్లాలో 4,102 హెక్టార్లలో వెదజల్లు పద్ధతిలో నాట్లు వేశారు. అత్యధికంగా బిక్కవోలులో 3,400 హెక్టార్లలో వెదజల్లు పద్ధతిలో సాగు చేయగా.. సీతానగరంలో 700 హెక్టార్లు, కొవ్వూరులో 2 హెక్టార్లలో సాగు చేశారు.

ఊపందుకున్న నారుమళ్లు

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్‌లో వరి 60,042 హెక్టార్లలో సాగవుతోంది. ఇందుకుగాను 2,682 హెక్టార్ల నారుమళ్ల అవసరం ఉంది. ఇప్పటి వరకు 2,325 హెక్టార్లలో పూర్తయింది. బిక్కవోలు, కడియం, తాళ్లపూడి, ఉండ్రాజవరం, కొవ్వూరు, చాగల్లు, సీతానగరం, రాజానగరం, కడియం, రాజమహేంద్రవరంలో 100 శాతం నారుమళ్లు పూర్తయ్యాయి. రాజమహేంద్రవరం రూరల్‌, గోకవరం, అనపర్తి, గోపాలపురంలో 90 శాతం పూర్తయ్యాయి.

ఎరువుల ఆవశ్యకత

గత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ ఎరువులను ముందస్తుగా అందుబాటులోకి ఉంచేది. ప్రస్తుతం అవసరమైన ఎరువులు లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 10వ తేదీ నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడిస్తున్నారు. జిల్లాలో రబీ సీజన్‌లో అన్ని రకాల ఎరువులు కలిపి 1.10 లక్షల మెట్రిక్‌ టన్నులకు గానూ సొసైటీలు, ప్రైవేట్‌ షాపుల ద్వారా 69,000 టన్నులు సరఫరా చేసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రత్యేకించి యూరియా 30,000 మెట్రిక్‌ టన్నులు అందజేసినట్లు పేర్కొంటున్నారు. అయినా జిల్లాలో మాత్రం ఎరువుల కొరత రైతులను వేధిస్తోందని ఆందోళన చెందుతున్నారు. పంట దిగుబడిలో కీలక భూమిక పోషించే ఎరువులు అందుబాటులో లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోతున్నారు.

అన్నదాతా సుఖీభవ అందేనా?

పంటల సాగును ప్రోత్సహించేందుకు గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రైతుభరోసా కింద ఏటా రూ.13,500 పెట్టుబడి నిధిగా అందజేసేది. రైతులు ఎవరి దగ్గరా అప్పులు చేయకుండా సాగు చేపట్టేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా రూ.20,000 అందజేస్తామని ప్రకటించి మోసం చేసింది. ప్రస్తుతం ఈ ఏడాదైనా అందజేస్తారా? లేదా? అన్న మీమాంస నెలకొంది.

అధిక యూరియా అనర్థం

రైతులు పంట సాగుకు యూరియా ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇది ప్రమాదకరం. యూరియాతో పాటు కాంప్లెక్స్‌ ఎరువులు కూడా వినియోగించాలి. అప్పుడే దిగుబడి పెరుగుతుంది. కేవలం యూరియాను మాత్రమే ఎక్కువగా వినియోగించడం వల్ల నేల చవుడు బారుతుంది. సహజత్వం కోల్పోతుంది. భవిష్యత్తులో నేలలో లవణత్వం పెరిగి సారం తగ్గే అవకాశం ఉంది.

– ఎస్‌.మాధవరావు, వ్యవసాయాధికారి

జిల్లాలో పంటల సాగు ఇలా... (హెక్టార్లలో)

మండలం వరి నారుమళ్లు నాట్లు

సాగు (హెక్టార్లలో)

(హెక్టార్లలో)

రాజమహేంద్రవరం రూరల్‌ 1,170 40 1,005

కడియం 2,269 100 1,000

రాజానగరం 3,549 150 1,821

అనపర్తి 3,816 70 1,800

బిక్కవోలు 6,092 100 3,620

కోరుకొండ 2,167 100 660

గోకవరం 1,840 90 95

సీతానగరం 2,891 125 1,500

రంగంపేట 980 35 550

చాగల్లు 3,465 150 2,500

దేవరపల్లి 3,008 120 500

గోపాలపురం 2,072 90 440

కొవ్వూరు 4,624 220 1,007

నిడదవోలు 7,293 320 850

పెరవలి 3,490 35 920

తాళ్లపూడి 3,546 150 628

ఉండ్రాజవరం 4,968 200 1,800

నల్లజెర్ల 2,803 130 900

ఖరీఫ్‌ను నట్టేట ముంచిన

వరుస విపత్తులు

పంట చేతికొచ్చే సమయంలో

వర్షాలతో సతమతం

ఆశించిన మేర అందని వరి దిగుబడి

ప్రస్తుత సీజన్‌లో

కోటి ఆశలతో కాడిపట్టిన కర్షకులు

ఈ ఏడాది 60,042

హెక్టార్లలో వరి సాగు

35.97 శాతం నాట్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement