వేగంగా రోడ్డు పనులు
అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రశాంతి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) నిధులతో చేపట్టిన రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేసే క్రమంలో ప్రభుత్వ, ప్రయివేటు పరంగా భూ సేకరణ ప్రక్రియపై సమగ్రంగా వివరాలు అందచేయాలని కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ చాంబర్‌లో జాయింట్ కలెక్టర్, ఆర్డీవో, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, రెవెన్యూ అధికారులతో ఏడీబీ రోడ్డు పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ఏడీబీ రహదారిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకుని రావడంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. రహదారి నిర్మాణ పనులకు ఆటంకం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ప్రాజెక్ట్ అధికారిగా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు, భూసేకరణ అధికారిగా రాజమహేంద్రవరం ఆర్డీవో కృష్ణనాయక్, ఎక్జిక్యూటివ్ ఏజెన్సీ తరఫున రాష్ట్ర హై వే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రహదారి విస్తరణ కోసం మొత్తం 72.16 ఎకరాల సేకరణ చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఇందులో 57.69 ఎకరాలు ప్రయివేటు భూమి సేకరించగా, తూర్పు గోదావరి జిల్లాలో 34.11 ఎకరాలు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీకి అప్పగించామన్నారు. భూ ఆక్రమణలకు పాల్పడిన వారిని ఖాళీ చేయించే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ఈ ఈ శ్రీకాంత్ , రాజానగరం, రంగంపేట తహసీల్దార్లు లావణ్య, కె.అనసూయ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment