మొక్కజొన్నకు చక్కని అదను
పెరవలి: జిల్లాలో రబీగా మొక్కజొన్న పంట సాగుకు ఇదే అనువైన సమయం. రబీ పంటలో తూర్పుగోదావరి జిల్లాలో నవంబర్ నుంచి జనవరి వరకు ఈ పంటను సాగు చేస్తారు. జిల్లాలో మొక్కజొన్న పంట 1,300 హెక్టార్లలో పెరవలి, నిడదవోలు, కొవ్వూరు, చాగల్లు, దేవరపల్లి, కోరుకొండ, కడియం మండలాల్లో సాగు చేస్తున్నారు. ఈ పంట సాగుచేసే విధానం, విత్తన ఎంపిక, నేలల స్వభావం, ఎరువుల యాజమాన్యం వంటి వివరాలను కొవ్వూరు వ్యవసాయ సహాయ సంచాలకులు(ఏడీఏ) పి.చంద్రశేఖర్ వివరించారు.
నేలలు
ఈ పంటకు ఇసుక, రేగడి, గరప, లోతైన మధ్యరకపు రేగడి నేలలు అనుకూలంగా ఉంటాయి. నీటిని నిల్వ ఉంచుకుని మురుగునీరు పోయే వసతి గల పంటభూములు దీనికి అనుకూలం.
విత్తన రకాలు
మొక్కజొన్న సాగుకు వాతావరణ పరిస్థితులను, తెగుళ్లను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి. ఇందులో స్వల్పకాలిక, మధ్యకాలిక, సంకరజాతి వంగడాలను గుర్తుంచుకుని పంటకాలం 85 రోజుల నుంచి 110 రోజుల వరకు ఉండేలా కావాల్సిన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. అశ్విని, హర్ష, వరుణ్, అంబర్ పాప్‌కార్న్, మాధురి, ప్రియా స్వీట్‌కార్న్, అంబర్ శక్తి 1, త్రిశూలత వంటి రకాలు ఉన్నాయి.
విత్తే కాలం, పద్ధతి
రబీ పంటగా నవంబర్ నుంచి జనవరి వరకు విత్తుకోవచ్చు. చేనును బాగా లోతుగా దుక్కి దున్నాలి. ఎకరానికి 27వేల మొక్కలు ఉండేలా విత్తుకోవాలి. సాలుకు సాలుకు మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 20 సెంటీమీటర్లు ఎడం ఉండేటట్టు చూసుకోవాలి. పంటకు సాగునీరు అందేలా, మురుగునీరు పోయేలా బోదెలను ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఉంటే పంట ఎదుగుదల సక్రమంగా జరుగుతుంది. ఎకరానికి సాధారణ రకాలు 7 కిలోల విత్తనాలు, పాప్‌కార్న్, తీపిరకం కండెల కోసం 4 నుంచి 5 కిలోల విత్తనం అవసరం ఉంటుంది.
విత్తనశుద్ధి
ఏ పంట సాగుచేసినా విత్తనశుద్ధి తప్పనిసరిగా చేయాలి. దీనివల్ల పంటపై ఆశించే తెగుళ్లను 50శాతం వరకు అరికట్టడంతో పాటు మొలక సాంద్రత ఎక్కువ ఉండి అధిక దిగుబడులు పొందవచ్చు. కిలో విత్తనానికి 5 గ్రాములు ఇమిడాక్లోఫ్రిడ్ లేదా 3 గ్రాముల మాంకోజబ్ మందుతో విత్తనశుద్ధి చేసుకోవాలి.
నీటి యాజమాన్యం
మొక్కజొన్న పంటకు సాగునీరు సక్రమంగా సమయానికి అందిస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. నీరు ఉందని అధిక మొత్తంలో నీటిని అందిస్తే పంట పాడవుతుంది. విత్తనాలను విత్తిన తరువాత తేలిక తడి మాత్రమే ఇవ్వాలి. నీరు నిల్వమాత్రం ఉండకూడదు. నిల్వ ఉంటే విత్తనం మొలకెత్తదు. 30 నుంచి 40రోజులు పంటకు ఎక్కువనీరు పెట్టకూడదు. ముఖ్యంగా మొక్కజొన్న పంట పూతదశకు ముందు, పూత దశలో, గింజ పాలుపోసుకునే దశలో నీరు సక్రమంగా అందించాలి.
ఎరువుల వినియోగం ఇలా..
మొక్కజొన్న పంటకు మిగిలిన పంటల కంటే కొంచెం ఎక్కువ మోతాదులో ఎరువులు అందించవలసి ఉంది. ఈ పంట వేసే రైతులు ఆఖరి దుక్కులో ఎకరానికి 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్‌ను వేయాలి. ఎకరానికి నత్రజని 48కిలోలు, భాస్వరం 24కిలోలు, పొటాష్ 20 కిలోలు వేయాలి. నత్రజనిని విత్తనం విత్తేటప్పుడు 12కిలోలు, విత్తిన నెలరోజులకు 24 కిలోలు, 50–55రోజులకు 12కిలోలు వేయాలి. భాస్వరం, పొటాష్ ఎరువులను విత్తే సమయంలోనే వేయాలి.
Comments
Please login to add a commentAdd a comment