కేంద్ర పథకాలు సమర్థంగా అమలు చేయాలి
రాజమహేంద్రవరం సిటీ: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేర్చడంలో అధికారులు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించాలని దిశ కమిటీ చైర్‌పర్సన్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. కలెక్టర్ పి.ప్రశాంతి అధ్యక్షతన నగర పాలక సంస్థ కార్యాలయంలో గురువారం జరిగిన జిల్లా అభివృద్ధి కో ఆర్డినేషన్, మానిటరింగ్ కమిటీ (దిశ) సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర పథకాల అమలులో గుర్తించిన లోపాలను అధిగమించేందుకు కృషి చేస్తామన్నారు. కేంద్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 37 కార్యక్రమాలపై సమీక్షించామన్నారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మాణ పనులు చేపట్టామని, అయితే ప్రజలు డ్రెయినేజీల కోసం డిమాండ్ చేస్తున్నారని, వాటికి కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉందని చెప్పారు. కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ కంపొనెంట్ నిధులు సమర్థంగా ఖర్చు చేస్తామన్నారు. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో తొలి దశ పనులు 60 శాతం పనులు పూర్తి చేశామని తెలిపారు. మిగిలిన లక్ష్యాలను మార్చిలోగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ సమావేశంలో 20 పాయింట్ల ప్రోగ్రాం చైర్మన్ లంకా దినకర్, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్, జెడ్పీ సీఈఓ వీవీఎస్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment