No Headline
సాక్షి, రాజమహేంద్రవరం: మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడు, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు.. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మధ్య మళ్లీ విభేదాల అగ్గి రగులుతోంది. ఆ మధ్య మున్సిపల్ ఎన్నికల నిర్వహణ.. రెండు రోజుల కిందట రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి(జీజీహెచ్)లో మందుల షాపు కేటాయింపుపై ఇరు వర్గాల మధ్య వివాదాలు ఏర్పడగా.. తాజాగా పేపరు మిల్లు నేతను ఆదిరెడ్డి ఫోనులో బెదిరించడంతో వారి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఈ బెదిరింపుల వ్యవహారాన్ని ఆ నేత సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ఈ వరుస సంఘటనలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి.
మందుల దుకాణంపై వివాదం
రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో ప్రభుత్వ జనరిక్ మందుల దుకాణాన్ని డీఆర్‌డీఏ ఆధ్వర్యాన మహిళా సంఘాలకు కేటాయిస్తున్నారు. 2019లో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వర్గానికి చెందిన కాళీకృష్ణ మహిళా శక్తి సంఘానికి ఐదేళ్ల పాటు నిర్వహించుకునే విధంగా అప్పగించారు. ఈ దుకాణం నిర్వహిస్తున్న ఆ సంఘం అధ్యక్షురాలు పిల్లా తనూజకు గత ఏడాది ఆగస్టుతో ఐదేళ్ల గడువు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో షాపు ఖాళీ చేయాలంటూ ఆమెకు జీజీహెచ్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే, జిల్లా సమాఖ్య తమకు 2029 వరకూ రెన్యువల్ చేసిందని, అందువలన ఆ దుకాణాన్ని ఖాళీ చేసేది లేదని బుచ్చయ్యకు చెందిన వర్గానికి చెందిన తనూజ ఒక్కసారిగా ఆందోళనకు దిగింది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఆయన తండ్రి అప్పారావు తమ అనుచరులతో కలిసి దౌర్జన్యానికి దిగుతున్నారని ఆరోపించింది. గోరంట్ల వర్గంలో ఉండటంతో తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా ఆ షాపును తమకు కేటాయించారని మరో వర్గానికి చెందిన మహిళ స్నేహంజలి యాదవ్ చెబుతోంది. దీంతో ఈ షాపు వివాదం కాస్త గోరంట్ల వర్సెస్ ఆదిరెడ్డి అన్నట్లుగా మారింది. ప్రస్తుతానికి ఈ షాపు కేటాయింపు వ్యవహారాన్ని కలెక్టర్ వాయిదా వేయడంతో వివాదానికి తాత్కాలికంగా తెర పడినట్లయింది. ఇదిలా ఉండగా నిబంధనల మేరకు అర్బన్ నియోజకవర్గ పరిధిలోని వారికే ప్రభుత్వాసుపత్రి జనరిక్ మెడికల్ స్టోర్ ఇవ్వాలంటూ కలెక్టర్, డీఆర్‌డీఏ అధికారులు స్పష్టం చేశారని ఆదిరెడ్డి అప్పారావు చెబుతున్నారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు గోరంట్ల, తాము నియోజకవర్గాల పరిధికి కట్టుబడి పని చేస్తున్నామంటూనే.. మెడికల్ షాపు తమ వర్గానికే దక్కాలనే సంకేతాలు ఇస్తున్నారు.
పేపర్ మిల్లు నేతకు బెదిరింపులు?
ఇదిలా ఉండగా రాజమహేంద్రవరం పేపర్ మిల్లు వ్యవహారంలో కార్మిక సంఘం నాయకుడు ప్రవీణ్ చౌదరిని ఆదిరెడ్డి అప్పారావు ఫోన్‌లో బెదిరించిన వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. వారి మధ్య జరిగిన ఫోను సంభాషణ వాట్సాప్ గ్రూపుల్లో హల్‌చల్ చేస్తోంది. ‘నువ్వు బుచ్చయ్య మాట విని వైఎస్సార్ పార్టీలోకి వెళ్లావు. ఏం పీకావు? మా మీద కామెంట్లు చేశావు. విడిచిపెడతాననుకోకు. కామెంట్లకు పనిష్మెంట్లు ఉంటాయి. ఐదేళ్లు విర్రవీగిపోయారు. నా తొక్కలో భరత్. మీరందరూ ఏం చేయలేరు. నువ్వు, బుచ్చయ్య చౌదరి ఏం చేస్తారు? వైఎస్సార్ సీపీ పదేళ్లయినా లేవదు. మిమ్మల్ని అంత తేలిగ్గా వదిలిపెడతామని అనుకోకు. ఆ రోజు హెచ్చరికలు చేస్తూ ప్రెస్‌మీట్లు పెట్టావు. ఏమనుకుని పెట్టావు? నీ తాహతు ఏంటి? నువ్వేంటి? నీ ఇల్లు ఎక్కడో తెలుసుకున్నాను. నీ సంగతి చూస్తాను’ అంటూ బెదిరింపులకు దిగినట్లు ఆ ఫోను సంభాషణలో ఉంది. అయితే, దీనిపై అప్పారావు గురువారం ప్రెస్‌మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. కూటమి అధికారంలోకి రావడంతో పేపర్ మిల్లు కార్మికుడు ప్రవీణ్ చౌదరి తమ వద్దకు వచ్చి మళ్లీ టీడీపీలో చేరుతానని చెప్పాడన్నారు. ప్రవీణ్ చౌదరితో భరత్ ఏం పీకాడని తాను వ్యాఖ్యానిస్తే.. మార్గాని భరత్ ఎడిట్ చేసి.. బుచ్చయ్య చౌదరి ఏం పీకుతారని అన్నట్లుగా ఎడిట్ చేసి ‘బెదిరిస్తున్న మాజీ ఎమ్మెల్సీ’ అని ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. బుచ్చయ్య చౌదరికి, తమకు మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయన్నారు. ఏది ఏమైనా ఫోన్ కాల్ ఎలా ఎడిట్ చేస్తారనే ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతోది. అప్పారావు అలా తిట్టకపోతే ఎందుకు వివరణ ఇచ్చారనే చర్చ ప్రజల్లో జరుగుతోంది. దీనిపై బుచ్చయ్య ఎలా స్పందిస్తారోననే ఆసక్తి నెలకొంది. బుచ్చయ్య సీరియస్‌గా తీసుకుంటే మాత్రం టీడీపీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఆదిరెడ్డి అప్పారావు తనను ఫోనులో బెదిరిస్తున్నట్లు సీఎం చంద్రబాబు దృష్టికి ప్రవీణ్ చౌదరి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు.
కొన్నేళ్లుగా ఇదే తంతు
ఆదిరెడ్డి అప్పారావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య కొన్నేళ్లుగా వర్గ పోరు నడుస్తూనే ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బుచ్చయ్య సిటీ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే, నియోజకవర్గ టీడీపీ నేతల సమావేశంలో ఆదిరెడ్డి వాసు సిటీ నుంచి తానే పోటీ చేస్తానని ప్రకటించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. సిటీ నియోజకవర్గంలో తనకు మద్దతు తెలిపే కార్పొరేటర్లతో బుచ్చయ్య అప్పట్లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం సైతం వివాదాస్పదంగా మారింది. అలాగే, రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణలో గోరంట్ల, ఆదిరెడ్డి వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాజమహేంద్రవరం రూరల్‌కు చెందిన విలీన గ్రామాలతో కలిపి కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని గోరంట్ల పట్టుబడుతూండగా.. విలీనం లేకుండానే ఎన్నికలకు వెళ్లాలని ఆదిరెడ్డి వర్గం వాదిస్తోంది. ఈ వ్యవహారం ఇప్పటికే సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. ఇరు వర్గాలపై సీఎం చంద్రబాబు సైతం అసహనం వ్యక్తం చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కలిసి కట్టుగా పోవాల్సింది పోయి రెండు వర్గాలుగా విభేదాలకు దిగడం తగదని గట్టిగా చెప్పినట్లు తెలిసింది.
ఫ రాజమహేంద్రవరం సిటీ
టీడీపీలో మళ్లీ వర్గపోరు
ఫ ఆదిరెడ్డి వర్సెస్ బుచ్చయ్య!
ఫ మొన్న మందుల షాపు..
నేడు పేపరు మిల్లు..
ఫ కార్మిక నేతకు ఫోనులో
ఆదిరెడ్డి బెదిరింపులు
ఫ సీఎం చంద్రబాబు వద్దకు పంచాయితీ!
Comments
Please login to add a commentAdd a comment