ఆరుగురి మృతికి ప్రభుత్వ వైఫల్యమే కారణం
చాగల్లు: తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయిన ఘటనతో భక్తుల మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్‌చార్జి తలారి వెంకట్రావు అన్నారు. మరణించిన భక్తుల ఆత్మలకు ఆ దేవదేవుడు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు. మండలంలోని నందిగంపాడు గ్రామంలో గురువారం జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. అవకతవకలు, అక్రమాలు, ప్రతిపక్షంపై దాడులతో పాలన మొదలు పెట్టిన కూటమి ప్రభుత్వం.. చివరకు పరమ పవిత్రమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్బూ ప్రసాదానికి కూడా మచ్చ తెచ్చే విధంగా కల్తీ నెయ్యి ముద్ర వేసిందని అన్నారు. కావలసిన వారి ఖాతాలో నెయ్యి సరఫరా కాంట్రాక్టు వేసుకునేంత వరకూ అహర్నిశలూ శ్రమించిందని దుయ్యబట్టారు. అర్ధరాత్రి బూతు కథనాలు ప్రసారం చేస్తూ.. తన చానల్ టీఆర్‌పీ రేటింగ్ పెంచుకునేందుకు ప్రయత్నించిన టీవీ–5 అధినేత బీఆర్ నాయుడును టీటీడీ చైర్మన్‌గా నియమించి మరింత ఆక్షేపణీయమైన పనికి కూటమి ప్రభుత్వం పాల్పడిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఏ ఒక్క పొరపాటుకూ తావు లేకుండా భక్తులకు అన్ని సౌకర్యాలూ కల్పించడంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవ ప్రశంసనీయమని అన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చావులేనని, గతంలో కూడా ఆయన నిర్లక్ష్యం వల్లే గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగిందని గుర్తు చేశారు. తిరుపతి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భక్తులకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జరిగిన ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందని వెంకట్రావు అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు చెల్లింకుల దుర్గా మల్లేశ్వరరావు, కౌన్సిలర్ కంఠమని రమేష్, నేతలు ఉప్పులూరి సూరిబాబు, మద్దుకూరి రవి, మట్టా వెంకట్రావు, ఉండవల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఫ బాధిత కుటుంబాలకు తక్షణమే
రూ.కోటి పరిహారం ఇవ్వాలి
ఫ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
ఫ మాజీ ఎమ్మెల్యే తలారి డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment