వేంకటేశ్వరస్వామి భక్తులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి
మధురపూడి: కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి భక్తులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను, ప్రమాదవశాత్తూ గాయపడిన వారిని గురువారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, భక్తుల భద్రతపై ముందస్తుగా పటిష్ట చర్యలు చేపట్టనందువల్లనే తిరుపతిలో తొక్కిసలాట ఘటన జరిగి, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. చంద్రబాబు పాలన ప్రజల పాలిట శాపంగా మారిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట ఈ తరహా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని, అయినప్పటికీ కూటమి ప్రభుత్వానికి ప్రచారార్భాటం తప్ప, ప్రజా క్షేమం పట్టడం లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్ కారణంగా గత గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి 29 మంది భక్తులు మృతి చెందారని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉండగా ఆయన నిర్వహించిన సభల్లో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో అనేక మంది మృతి చెందారన్నారు. మృతుల కోసం చంద్రబాబు కనీసం ఒక్క నిమిషం కూడా బాధ పడిన దాఖలాలు లేవని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారన్నారు. తిరుపతి లడ్డూపై దుర్మార్గమైన ప్రచారం చేశారన్నారు. నెయ్యిలో కల్తీ జరిగిందంటూ మాజీ సీఎం జగన్‌పై అసత్య ప్రచారం సాగించి, తిరుమల పవిత్రతను దెబ్బ తీశారన్నారు. సాక్షాత్తూ వేంకటేశ్వరస్వామిని రాజకీయాలకు వాడుకున్నందువల్లనే ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ధర్మ పరిరక్షణ, హైందవ ధర్మం కోసం పని చేస్తానన్న పవన్ కల్యాణ్ ఈ ప్రమాద ఘటనపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మృతుల కుటుంబాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. ఆయా కుటుంబాలకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని రాజా చెప్పారు.
ఫ చంద్రబాబుకు వైఎస్సార్ సీపీ నేత
జక్కంపూడి రాజా డిమాండ్
ఫ భక్తుల భద్రతపై ప్రభుత్వం
దృష్టి సారించనందువల్లనే ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment