పోషణ్ ప్లస్‌తో రక్తహీనతకు చెక్
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కౌమార దశలోని ఆడపిల్లల్లో రక్తహీనతకు చెక్ పెట్టేందుకు పోషణ్ ప్లస్ కార్యక్రమం అమలు చేస్తున్నామని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. జిల్లా యంత్రాంగం, వైద్య, ఆరోగ్యం, ఇతర సమన్వయ శాఖల ఆధ్వర్యాన నగరంలోని పోస్ట్‌మెట్రిక్ బాలికల వసతి గృహంలో ఈ కార్యక్రమాన్ని ఆమె గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వసతి గృహాల్లోని బాలికలకు పోషణ్ ప్లస్ కింద ఐరన్ మాత్రలతో పాటు మునగాకు పొడి అందజేస్తున్నామన్నారు. రక్తహీనతతో కళ్లు తిరిగి పడిపోవడం వంటివి జరుగుతూంటాయని, దీని నివారణకు మనం తీసుకునే ఆహారంలో ఐరన్ పోషకాలు అందుతున్నయో లేదో నిర్ధారించుకోవడం ముఖ్యమని చెప్పారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో కౌమార దశలో ఉన్న 2,793 బాలికలకు మునగాకు పొడి అందజేశామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు కలెక్టర్ స్వయంగా ఆహారం వడ్డించారు.
జాతీయ స్థాయి
పోటీలకు ఎంపిక
దేవరపల్లి: స్థానిక అంబటి సత్యనారాయణరావు జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులు జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 6, 7, 8 తేదీల్లో మంగళగిరిలో జరిగిన రాష్ట్ర స్థాయి మహిళా క్రికెట్ అండర్–17 పోటీల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జట్టు తరఫున పాల్గొన్న దేవరపల్లికి చెందిన ఓరుగంటి సాహితీశ్రీ, కె.లీలాసాయి ప్రసన్న సత్తా చాటారు. సాహితీశ్రీ ఐదు మ్యాచ్‌లలో బ్యాటింగ్ చేసి 200 పరుగులు సాధించగా, లీలాసాయి ప్రసన్న బౌలింగ్‌లో ప్రతిభ చూపింది. వీరిద్దరూ ఈ నెల 28న హైదరాబాద్‌లో జరగనున్న జాతీయ స్థాయి టోర్నమెంటులో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారని పీడీ ఓరుగంటి నాగరాజు తెలిపారు. సాహితీశ్రీ గతంలో జైపూర్, భువనేశ్వర్‌లో జరిగిన అండర్–15 పోటీల్లో ప్రతిభ చూపింది. ఇదిలా ఉండగా, గత నెల 27, 28, 29 తేదీల్లో కేరళలో జరిగిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ సెపక్‌తక్రా పోటీల్లో కె.వర్షిణి, వి.ప్రవీణ్‌లు ఉమ్మడి పశ్చిమ గోదావరి జట్లలో ఆడి ప్రతిభ చూపారని నాగరాజు తెలిపారు. వర్షిణి గతంలో ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని రజత పతకం సాధించిందన్నారు. ఈమె ఫిబ్రవరిలో విజయవాడలో జరిగే ఎస్‌జీఎఫ్ అండర్–14 రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటోందని చెప్పారు. క్రీడాకారులను ప్రధానోపాధ్యాయురాలు బి.శ్రీలక్ష్మి, పీడీ నాగరాజు, పీఎంసీ చైర్మన్ వేముల రాజు, ఉపాధ్యాయులు అభినందించారు.
ప్రతిభ చూపిన విద్యార్థులతో
హెచ్‌ఎం శ్రీలక్ష్మి తదితరులు
Comments
Please login to add a commentAdd a comment