మాండలీకాలను గ్రంథస్తం చేయిస్తాం | - | Sakshi
Sakshi News home page

మాండలీకాలను గ్రంథస్తం చేయిస్తాం

Published Fri, Jan 10 2025 3:01 AM | Last Updated on Fri, Jan 10 2025 3:02 AM

మాండల

మాండలీకాలను గ్రంథస్తం చేయిస్తాం

రాజానగరం: దేశ భాషలందు తెలుగు లెస్స అని ఏనాడో కీర్తినందుకున్న మన మాతృ భాష పూర్వ వైభవాన్ని సంతరించుకునేందుకు, భాషా వికాసానికి కృషి చేస్తామని రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. స్థానిక గోదావరి గ్లోబల్‌ యూనివర్సిటీ(జీజీయూ)లో చాన్సలర్‌ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) అధ్యక్షతన రెండు రోజుల పాటు జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో పద్య, సాంఘిక నాటకాలను ప్రోత్సహించాలని, నందీ నాటకోత్సవాలను కూడా పునరుద్ధరించదలచామని అన్నారు. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన కాళీపట్నం రామారావు కథా నిలయం (ఉత్తరాంధ్ర), సీపీ బ్రౌన్‌ మందిరం(రాజమహేంద్రవరం)తో పాటు ప్రసిద్ధ గ్రంథాలయాలను సాంస్కృతిక పర్యాటకం అభివృద్ధిలో భాగంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. తద్వారా అక్కడి గ్రంథాలను అధ్యయనం చేసే అవకాశం కలిగి, భాషా వికాసానికి మార్గం ఏర్పడుతుందన్నారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమల్లోని మాండలీకాలను గ్రంథస్తం చేయాలనే ఆలోచన ఉందని మంత్రి తెలిపారు. తెలుగు భాష వినియోగాన్ని పెంపొందించడంతో పాటు భావితరాలకు చేరువ చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని దుర్గేష్‌ చెప్పారు.

రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ, జాతీయ విద్యా విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మాతృ భాషకు ప్రాధాన్యం ఇచ్చిందని అన్నారు. తెలుగు భాష ఎంతో ప్రాచీనమైనదని, ఐతరేయ బ్రాహ్మణం, మహాభారతంలో కూడా ఆంధ్రుల ప్రస్తావన ఉందని చెప్పారు. దేశంలో ప్రాచీన హోదా కల్పించిన ఆరు భాషల్లో తెలుగు కూడా ఉందన్నారు. ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగు ప్రపంచంలో 15, మన దేశంలో నాలుగు స్థానాల్లో ఉందని తెలిపారు. తెలుగు భాష గొప్పదనాన్ని ఇతర భాషీయులు గుర్తిస్తున్నారు కానీ, మనమే ఇంకా గుర్తించలేక పోతున్నామని ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ అన్నారు. తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి తెలుగు విశిష్టత గురించి చెప్పారన్నారు. తుళు భాష మాట్లాడే శ్రీకృష్ణదేవరాయలే ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని ఏనాడో చెప్పారని గుర్తు చేశారు.

ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో ప్రజ్ఞావంతులైన పలువురిని ఘనంగా సన్మానించారు. తెలుగు భాష గొప్పతనాన్ని ప్రతిబింబించేలా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లోని వివిధ కళాశాలల చెందిన విద్యార్థులు ప్రదిర్శంచిన సాంసృతిక, సాహిత్య కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ లంకా దినకర్‌, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, ద్విసహస్రావధాని కడిమెళ్ల వరప్రసాద్‌, కవి అందెశ్రీ, సినీ నటి హేమ, ఆస్ట్రేలియా తెలుగు సంఘం ప్రతినిధి కృష్ణ నడింపల్లి, ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, జ్యోతుల నెహ్రూ, బండారు సత్యానందరావు, దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ గోపిమూర్తి, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, జీజీయూ వైస్‌ చాన్సలర్‌ యు.చంద్రశేఖర్‌, ప్రో. చాన్సలర్‌ కె.శశికిరణ్‌వర్మ, కిమ్స్‌ ఎండీ కె.రవికిరణ్‌వర్మ, పలువురు కవులు, సాహితీవేత్తలు, సినీ కళాకారులు పాల్గొన్నారు.

ఫ తెలుగు భాషా వికాసానికి కృషి

ఫ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్‌

ఫ ముగిసిన ప్రపంచ తెలుగు మహాసభలు

No comments yet. Be the first to comment!
Add a comment
మాండలీకాలను గ్రంథస్తం చేయిస్తాం1
1/1

మాండలీకాలను గ్రంథస్తం చేయిస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement