సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తొలగింపు, అరెస్ట్ వార్తలు మన దగ్గర కూడా చాలా ఆసక్తిని రేకెత్తించాయి. ఇందుకు మూడు కారణాలున్నాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో అవినీతి అత్యల్పంగా కనిపించే సింగపూర్‌లో అవినీతి ఆరోపణలపై ఒక మంత్రి అరెస్ట్ కావడం మొదటి కారణం. రెండవది ఈశ్వరన్ భారతీయ సంతతికి చెందినవాడు కావడం. మూడో కారణం మరీ ముఖ్యమైనది. ఆయన మన చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు కావడం. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన గ్లోబల్æ రియల్ ఎస్టేట్ వెంచర్ అమరావతిలో ఈశ్వరన్ కూడా భాగస్వామి.
అమరావతి కోర్ ఏరియాలో 1691 ఎకరాల భూమిని రాజధాని స్టార్టప్ ఏరియాగా డెవలప్ చేసే కాంట్రాక్టును సింగపూర్ కన్సార్టియానికి చంద్రబాబు అప్పగించారు. ఈ ఒప్పందం కోసం ఈశ్వరన్, ఆయన సింగపూర్ టీమ్ పలుమార్లు విజయవాడకు వచ్చారు. చంద్రబాబు, లోకేశ్‌లు కూడా సింగపూర్‌లో పర్యటించారు. చివరికి 2017లో ఒప్పందం కుదిరింది. ఇది సింగపూర్ ప్రభుత్వ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకుంటున్న ఒప్పందంగా బిల్డప్ ఇచ్చారు. సింగపూర్ మంత్రిగా ఉన్న ఈశ్వరన్ స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో నాటకం రక్తికట్టింది. ఆయనతోపాటు పాల్గొన్న సింగపూర్ ‘అధికారులు’ కూడా ఆ తర్వాత తమ అవతారాలను మార్చడం వింతగొలిపే విషయం.
అసెండస్ – సింగ్ బ్రిడ్జ్, సెంబ్ కార్ఫ్ అనే ప్రైవేట్ కంపెనీల కన్సార్టియంతో ఒప్పందం కుదిరింది. ఇవి ప్రభుత్వ కంపెనీలేనని బాబు సర్కార్ బుకాయించింది. సింగపూర్‌లో చాలా కంపెనీల్లో ప్రభుత్వ సంస్థల వాటా అంతో ఇంతో ఉంటుంది. సెంబ్ కార్ప్‌లో కూడా టుమాసెక్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనే ప్రభుత్వ సంస్థ పెట్టుబడి ఉన్నది. కానీ మెజారిటీ వాటా ప్రైవేట్‌దే! ఈ టుమాసెక్ హోల్డింగ్స్ లిమిటెడ్‌కు ఒక మూడేళ్లపాటు ఈశ్వరన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. సెంబ్‌కార్ప్‌లో టుమాసెక్ పెట్టుబడి వెనుక ఆయన పలుకుబడి ఉపయోగపడి ఉండవచ్చు. సెంబ్‌కార్ప్‌పై ఆయనకు ప్రత్యేక ఆసక్తి కూడా ఉండవచ్చు.
సింగపూర్ కన్సార్టియంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని చూసి ఆరోజుల్లోనే పలువురు ముక్కున వేలేసుకున్నారు. సింగపూర్ కన్సార్టియం, కేపిటల్ సిటీ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ కలిసి అమరావతి డెవలప్‌మెంట్ పార్టనర్ (ఏడీపీ) ఏర్పాటయింది. ఈ సంస్థకు ప్రభుత్వం 1691 ఎకరాల భూమిని అప్పగించింది. కనీస ధర ఎకరాకు రూ.4 కోట్లుగా నిర్ణయించింది. అంటే ఈ మొత్తం భూమి కనీస విలువ 6,764 కోట్లు. ఇంత విలువ చేసే భూమిని ఏడీపీకి ప్రభుత్వం ఉచితంగానే ఇచ్చింది. ఇందులో 250 ఎకరాల భూమిని సింగపూర్ కంపెనీలకు ఉచితంగా కేటాయించింది. ఆ భూమిని అభివృద్ధి చేసుకుని వారే అమ్మేసుకోవచ్చు. ఈ మొత్తం భూమిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 5500 కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికి బాబు సర్కార్ అంగీకరించింది.
అమరావతి డెవలప్‌మెంట్ పార్ట్‌నర్ (ఏడీపీ)తో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉండే సిటీ డెవలప్‌మెంట్ మేనేజింగ్ కమిటీ (సీసీడీఎంసీ) తన వాటా కింద 221 కోట్లు పెట్టుబడిగా పెడుతుంది. భూమి విలువతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు 12,485 కోట్లు. ఇందులో సింగపూర్ కన్సార్టియం పెట్టే ఖర్చు ఒక్క రూపాయి కూడా లేదు. భూమిని అభివృద్ధి చేసి ప్లాట్లుగా వేసి విక్రయించడానికి ఇంకో 3,137 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఇందులో 306 కోట్ల ఖర్చును సింగపూర్ కన్సార్టియం భరిస్తుంది. మొత్తం పెట్టుబడిలో కన్సార్టియం ఖర్చుపెట్టేది సుమారు రెండు శాతం! కానీ వ్యాపారంలో దాని వాటా 58 శాతం. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ సీసీడీఎంసీ వాటా 42 శాతం మాత్రమే. సొమ్మొకడిది సోకొకడిది అనే సామెతకు ఈ ఒప్పందం సరైన ఉదాహణ. ఇది కాకుండా మరో 250 ఎకరాల భూమి కన్సార్టియంకు ఉచితంగా దక్కుతుంది.
అభివృద్ధి చేసిన ప్లాట్లను అమ్మి వ్యాపారం చేసే బాధ్యత అమరావతి డెవలప్‌మెంట్ పార్ట్‌నర్ (ఏడీపీ)ది కాదు. ఇందుకోసం మరో మేనేజ్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అమరావతి మేనేజిమెంట్ సర్వీసెస్ పేరుతో విజయవాడ అడ్రస్‌తో ఆర్‌వోసీలో రిజిస్టరయింది. దీని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బెంజిమిన్ యాప్ నియుక్తులయ్యారు. స్టార్టప్ ఏరియా ఒప్పందం కోసం జరిగిన చర్చల్లో యాప్ సింగపూర్ ప్రభుత్వ అధికారి హోదాలో పాల్గొన్నారు. చివరికి విజయవాడలో రిజిస్టరయిన కంపెనీకి ఈవోగా అవతారం మారింది. అమరావతి కుంభకోణంలో ఇటువంటి వింతలు ఇంకెన్నో బయటపడాల్సి ఉన్నది.
చంద్రబాబు – ఈశ్వరన్‌ల మధ్య పెనవేసుకున్న బంధం ఈనాటిది కాదు. సుమారు రెండు దశాబ్దాల చరిత్ర ఉందని చెబుతారు. సింగపూర్‌లో చంద్రబాబుకు స్టార్ హోటళ్లు ఉన్నాయనే ప్రచారం ఎప్పటినుంచో ఉన్నది. ఈశ్వరన్ పదవీచ్యుతి, అరెస్ట్ వెనుక కూడా ఓ హోటల్ కనెక్షన్ ఉన్నది. ఆంగ్ బెంగ్ సెంగ్ అనే వ్యక్తి హోటల్ ప్రాపర్టీస్ లిమిటెడ్ అనే సంస్థ వ్యవస్థాపకుడు. మేనేజింగ్ డైరెక్టర్. అవినీతి, అక్రమ వ్యవహారాల ఆరోపణపై ఆంగ్‌ను సీపీఐబీ (కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో) అరెస్ట్ చేసింది. అతడిని విచారిస్తున్న నేపథ్యంలోనే ఈశ్వరన్ తీగ దర్యాప్తు సంస్థకు దొరికింది.
ఆంగ్ బెంగ్ సెంగ్ కంపెనీ ఆధ్వర్యంలో యాభైకి పైగా నక్షత్ర హోటళ్లు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయట. ఇవన్నీ ఆంగ్ సొంతం కావు. వివిధ దేశాల రాజకీయ ప్రముఖులు, సంపన్నుల సొమ్ముతో భారీ హోటళ్లు నిర్మించి వాటిని తాను లీజుకు తీసుకుని నడుపుతుంటాడు. మన దగ్గర ప్రచారంలో ఉన్నట్టు చంద్రబాబుకు స్టార్ హోటళ్లు ఉన్నాయా? ఉంటే అవి సింగపూర్‌లోనే ఉన్నాయా? లేక సింగపూర్ కంపెనీ ఆధ్వర్యంలో ఇంకెక్కడైనా ఉన్నాయా అనే అంశంపై కచ్చితమైన సమాచారం లేదు. కానీ చంద్రబాఋకు ఈశ్వరన్‌తో ఉన్న బంధం, ఈశ్వరన్‌కు హోటల్ ప్రాపర్టీస్ అధిపతి ఆంగ్‌తో అనుమానాస్పద కనెక్షన్‌ను బట్టి చూస్తే చంద్రబాబు హోటళ్ల ప్రచారానికి బలం చేకూరుతున్నది.
ఆంగ్ బెంగ్ సెంగ్‌పై వచ్చిన ఆరోపణలేమిటి? వాటితో ఈశ్వరన్‌కు ఉన్న సంబంధమేమిటి? అసలు ఈశ్వరన్‌ను పట్టడానికే ఆంగ్‌ను ఎరగా వేశారా? ఈశ్వరన్‌పై జరగనున్న దర్యాప్తు ఎక్కడికి వెళ్తుంది? ఆ దర్యాప్తుకు అమరావతి తీగ తగులుతుందా లేదా? తగిలితే చంద్రబాబు భవిష్యత్తేమిటి? వగైరా ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరకవచ్చు. సింగపూర్ దర్యాప్తులో అమరావతి కోణం తగిలినా తగలకపోయినా, ఈ ప్రాజెక్టులో లక్షల కోట్లు ఆర్జించాలనుకున్న చంద్రబాబు కల మాత్రం కరిగిపోయినట్టే భావించాలి. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కార్‌ను ఎదుర్కోవడానికి చంద్రబాబు దగ్గర పనికొచ్చే అస్త్రాలేమీ లేవు. అమరావతినీ, రాజధానినీ ఒక మిడిల్‌క్లాస్ సెంటిమెంట్‌గా మార్చి రంగంలో నిలబడేందుకు బాబు దళం ఆపసోపాలు పడుతున్నది. సింగపూర్ దర్యాప్తులో అమరావతి తీగ తగిలితే, అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పదమైతే సెంటిమెంట్ పప్పులుడకవు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం పరిస్థితి దయనీయంగా తయారైంది. ఎదురుదెబ్బలు వరసగా తగులుతున్నాయి. అధికార వైసీపీ కులమతాలకు అతీతంగా పేద, మధ్యతరగతి వర్గాల్లో గణనీయంగా బలపడింది. ఇటీవల జరిగిన రెండు మూడు సర్వేలు ఈ విషయాన్ని నిర్ధారించాయి. వైసీపీ ఓటింగ్ బలం 51 నుంచి 55 శాతం వరకు ఉంటుందని ఆ సర్వేలు ప్రకటించాయి. నిజానికి సర్వేలు కూడా అవసరం లేదు. పేదలు – పెత్తందార్ల ప్రయోజనాల నడుమ విభజన రేఖ ఏర్పడింది. ప్రతిపక్షం పేదల వ్యతిరేక వైఖరిని బహిరంగంగానే తీసుకుంటున్నది.
ప్రజలకు అత్యంత ఉపయోగకరంగా మారిన వలంటీర్ వ్యవస్థను, గ్రామ సచివాలయాలను రద్దు చేయాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తున్నది. పేద పిల్లలకు ఇంగ్లిషు మీడియంలో పాఠాలు చెప్పొద్దని అభాసుపాలైంది. ప్రాణాంతకమైన మద్యం ధరలు తగ్గించాలని కోరుతున్నది. పేదలకు ఇళ్లు కట్టించడంపై కోర్టులకెక్కుతున్నది. దశాబ్దాల తర్వాత వ్యవసాయ కూలీలకు భూపంపిణీ చేయతలపెడితే హర్షించలేకపోతున్నది. ఆరోగ్య విప్లవంపై అవాకులు పేలుతున్నది. ఈ తరహా ఆత్మహత్యాసదృశ వైఖరితో ప్రతిపక్షం తనను తాను హననం చేసుకుంటున్నది. ముప్పాతిక శాతం ప్రజల హృదయాల నుంచి వెలివేతకు గురవుతున్నది.
మరోపక్క తెలుగుదేశం పార్టీకీ, చంద్రబాబుకూ గురుతుల్యునిగా, రక్షకునిగా నిలబడుతున్న రామోజీ పాపభాండం బద్దలైంది. ‘మార్గదర్శి’ పేరుతో చేసిన చట్టవిరుద్ధ నిర్వాకం మెడకు చుట్టుకుంటున్నది. ముదివయసు విచక్షణను కోల్పోయింది. అడ్డగోలు రాతలతో యెల్లో మీడియా విశ్వసనీయతను జారవిడుచుకున్నది. రెండు వారాలకే వారాహి యాత్ర రోత పుట్టించింది. నటుడి మనోధృతిపై జనంలో శంక మొదలైంది. ఒక ప్రయోగం నిష్ఫలమైంది. ఇప్పుడు బాబు కూటమికి ఎటుచూస్తే అటు చీకటి. పటు నిరాశ. అన్నీ దుశ్శకునములే! కొసరుగా ఇప్పుడీ సింగపూర్ పీడకల!!
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Sakshi Editorial: ఇంటిదొంగ – ఈశ్వరన్!
Published Sun, Jul 16 2023 12:07 AM | Last Updated on Sun, Jul 16 2023 11:40 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment