చిన్నగా మొదలైన కొన్ని అంశాలే కాలగతిలో పెను పరిణామాలకు దారితీస్తాయి. ఇది చరిత్రలోని చిత్రమైన లక్షణం. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వ్యవహారానికి సంబంధించి అక్కడి జిల్లా న్యాయస్థానం సోమవారం ఇచ్చిన 26 పేజీల ఆదేశం సరిగ్గా అలాంటిదే. మసీదు ప్రాంగణంలోని హిందూ దేవతామూర్తులను పూజించేందుకు అనుమతించాలంటూ అయిదుగురు హిందూ మహిళలు వేసిన పిటిషన్ విచారణార్హమైనదే అని కోర్టు నిర్ణయించడం కీలక పరిణామం. 17వ శతాబ్దికి చెందిన ఈ మసీదులో పూజలకు అనుమతించడానికి ఇప్పుడున్న మూడు చట్టాల ప్రకారం కుదరదంటూ మసీదును నిర్వహిస్తున్న అంజుమన్ ఇంతెజామియా మస్జిద్ కమిటీ వాదించింది. ప్రార్థనా స్థలాల (ప్రత్యేక ఏర్పాట్ల) చట్టం – 1991, వక్ఫ్ చట్టం – 1995, యూపీ శ్రీకాశీ విశ్వనాథ్ ఆలయ చట్టం –1983... ఈ మూడింటినీ కమిటీ ప్రస్తావించింది. కానీ, జడ్జి విశ్వేశ ఆ వాదనను తోసిపుచ్చారు. ఈ 22న విచారణకు నిర్ణయించారు. జిల్లా కోర్ట్ ఆదేశంపై మస్జిద్ కమిటీ హైకోర్ట్ గుమ్మం తొక్కనుంది. వెరసి, సుదీర్ఘంగా సాగిన అయోధ్యలోని వివాదాస్పద బాబ్రీ మసీదు – రామజన్మభూమి వ్యవహారంలా ఇక ఇప్పుడు కాశీలో జ్ఞానవాపి కథ మొదలు కానుంది.
కొద్దినెలల విరామం తర్వాత జ్ఞానవాపి మసీదు వివాదంలో మొదలైన ఈ కొత్త అంకం అనేక పర్యవసానాలకు దారితీయడం ఖాయం. కొద్ది నెలల క్రితం మసీదు ప్రాంగణాన్ని సర్వే చేసి, వీడియో తీసినప్పుడు బయటపడ్డ శివలింగం తరహా నిర్మాణం గురించి కోర్టులో చర్చకు రానుంది. అయోధ్య, కాశీ, మథురల్లోని మసీదులు నిజానికి హిందువుల భూభూగాలేననే వాదన దీర్ఘకాలంగా ఉంది. చాలా ఏళ్ళుగా బీజేపీ, సంఘ్ పరివార్‌లు దాన్ని తమ రాజకీయ అజెండాగా మార్చుకున్నాయి. దీనిపై ఇటు వీధుల్లోనూ, అటు కోర్టుల్లోనూ పోరు సాగిస్తూనే ఉన్నాయి. రామజన్మభూమి ఉద్యమం తీవ్రంగా సాగుతున్న వేళ ఆ స్థాయి వివాదాలు ఇతర ప్రార్థనా స్థలాలపై తలెత్తకూడదనే ఉద్దేశంతో 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని అప్పటి కేంద్రప్రభుత్వం చేసింది. 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న స్థితినే కొనసాగించాలనీ, ఏ వివాదాస్పద ప్రార్థనా స్థల స్వరూప స్వభావాలనూ మార్చ రాదనీ సదరు చట్టం నిర్దేశిస్తోంది. తీరా 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతతో ప్రార్థనాస్థల రాజకీయాలు పతాకస్థాయికి చేరాయి. మళ్ళీ ఇప్పుడు జ్ఞానవాపిపై కోర్టు ఆదేశంతో ఒకప్పటి బాబ్రీ మసీదు వివాదంలా సమాజంలోని రెండు వర్గాల మధ్య సామరస్యం దెబ్బతిని, సుస్థిరత దెబ్బతినే ప్రమాదం ఉంది. 1991 నాటి చట్టం సైతం నిష్ప్రయోజనం కావచ్చని ముస్లిమ్ వర్గం ఆందోళన.
అయితే, 1947కూ, 1993కూ మధ్య జ్ఞానవాపి ప్రాంగణంలో హిందువుల ప్రార్థనలను అనుమతించారు. 1993 తర్వాతా ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఏటా ఒకసారి అక్కడ దేవతామూర్తుల ప్రార్థనకు వీలు కల్పిస్తున్నారు. హిందూ మహిళల పిటిషన్‌ను అనుమతించిన జిల్లా కోర్ట్ ఆ సంగతులే గుర్తు చేసింది. ప్రార్థనాస్థల ధార్మిక స్వరూప స్వభావాలను మార్చే ప్రయత్నమేదీ ఇందులో లేదనీ, అక్కడ పూజలు చేసుకొనే హక్కు మాత్రమే అడుగుతున్నారనీ వ్యాఖ్యానించింది. కానీ, కథ అంతటితో ఆగుతుందా అన్నది ప్రశ్న. నిజానికి, జ్ఞానవాపి ప్రాంగణంపై హక్కులకు సంబంధించి హైకోర్ట్‌లో ఇప్పటికే అనేక కేసులు విచారణలో ఉన్నాయి. ప్రాంగణంలో భారత సర్వేక్షణ సంస్థ (ఏఎస్‌ఐ)తో సర్వేకు అనుమతిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశం పైనా హైకోర్ట్ విచారిస్తోంది. ఇలా జ్ఞానవాపిపై ఒక వర్గం ఒకే రకమైన పలు కేసులు దాఖలు చేయడం ఒక వ్యూహం ప్రకారం జరుగుతోందని రెండో వర్గం అనుమానం.
పూజల కోసం భక్తులు వేసిన పిటిషన్‌ను ముందుగా జిల్లా కోర్టు వినాలని ఆ మధ్య సుప్రీం కోర్టే చెప్పింది. వారణాసి కోర్ట్ తాజా నిర్ణయంతో వివాదం పైకోర్టులకు పాకుతుంది. నిజానికి, దశాబ్దాల తరబడి సాగిన రామజన్మభూమి వివాదంపై 2019లో అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు నిచ్చింది. బాబ్రీ మసీదు ఒకప్పుడున్న స్థలంలో రామాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిస్తూనే, 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని భారత రాజ్యాంగ లౌకికవాద లక్షణాలను కాపాడేందుకు తీర్చి దిద్దిన చట్టపరమైన పరికరంగా అభివర్ణించింది. తీరా తాజా నిర్ణయంతో వారణాసి కోర్ట్ ఆ మాట లను ప్రశ్నార్థకం చేసి, వివాదాల తేనెతుట్టెను కదిలించింది. పైకి కోర్టు కేసులుగా కనిపిస్తున్నా, వీటిలో రాజకీయాలూ పుష్కలం. బాబ్రీ మసీదు వివాదంతో ఇప్పటికే దేశంలో ఒక వర్గాన్ని బయటి వ్యక్తులుగా చూసే ధోరణి ప్రబలింది. జాతీయవాదం, హైందవ ఆత్మగౌరవం లాంటి పదబంధా లకు ప్రాచుర్యం పెరిగింది. మరోపక్క మథుర, ఆగ్రాల్లోనూ ఇలాంటి కేసులే కోర్టుల్లో ఉన్నాయి.
అసలు ‘ప్రార్థనాస్థలాల చట్టం–1991’ రాజ్యాంగబద్ధత పైనా సుప్రీమ్‌లో కేసు పెండింగ్‌లో ఉంది. ఆ అంశంపై సుప్రీమ్ తీర్పు కోసం నిరీక్షించకుండా, జిల్లా కోర్ట్ అత్యుత్సాహం చూపింది. ఈ పరిస్థితుల్లో ఈ వివాదాలన్నిటికీ కీలకం కానున్న 1991 నాటి చట్టానికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ఎంత త్వరగా తన తీర్పునిస్తే అంత మంచిది. కింది కోర్టులకు అది మార్గదర్శకమవుతుంది. సమస్యలు మరింత జటిలం కాకుండా అడ్డుకుంటుంది. ఎందుకంటే, ధార్మిక విశ్వాసాలు నిప్పు లాంటివి. వాటితో చెలగాటమాడితే చేతులు కాలక తప్పదు. ఏమరుపాటుగా ఉంటే సమాజాన్నీ, విభిన్న వర్గాల సామరస్యాన్నీ ఆ అగ్ని దహించకా తప్పదు. న్యాయస్థానాల మొదలు ప్రభుత్వాల దాకా అందరూ అప్రమత్తంగా ఉండాల్సింది అందుకే!
Comments
Please login to add a commentAdd a comment