17 వేల మందికి పోస్టల్‌ బ్యాలెట్‌ | Sakshi
Sakshi News home page

17 వేల మందికి పోస్టల్‌ బ్యాలెట్‌

Published Sun, May 5 2024 2:50 AM

17 వేల మందికి పోస్టల్‌ బ్యాలెట్‌

నూజివీడు: జిల్లాలో 17 వేల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని కలెక్టర్‌ వె.ప్రసన్న వెంకటేష్‌ చెప్పారు. నూజివీడులోని ట్రిపుల్‌ ఐటీలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను శనివారం కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 12 వేల మందికి పైగా ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులు, 2 వేల మంది పోలీసు సిబ్బంది, జిల్లాలో పనిచేస్తూ ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగిన సిబ్బంది 3 వేల మందికి పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించామన్నారు. వీరికి ఈ నెల 4, 5 తేదీలలో నియోజకవర్గాల ప్రధాన కేంద్రాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రాలలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ చెప్పారు. ఇతర ఏ జిల్లాలో తమ ఓటు ఉన్నప్పటికీ, ఈ జిల్లాలో వారు పనిచేసే నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో తమ ఓటు హక్కును పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా వినియోగించుకుంటారన్నారు. జిల్లాలో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు ’హోమ్‌ ఓటింగ్‌’ విధానం ద్వారా 926 మంది కదలలేని స్థితిలో ఉన్న వృద్ధులు, వయోవృద్ధుల ఇళ్ల వద్దకు వెళ్లి వారికి ఓటు హక్కు కల్పిస్తున్నామని వివరించారు. కలెక్టర్‌ వెంట నూజివీడు ఆర్డీఓ వై.భవాని శంకరి, రెవెన్యూ, పోలీసు, ఇతర అధికారులు ఉన్నారు.

Advertisement
Advertisement