నేడు నీట్‌ పరీక్ష | Sakshi
Sakshi News home page

నేడు నీట్‌ పరీక్ష

Published Sun, May 5 2024 2:55 AM

నేడు నీట్‌ పరీక్ష

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): దేశంలోని వైద్య విద్యా కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) ఆదివారం ఏలూరులో జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకూ పరీక్ష నిర్వహించనున్నారు. ఏలూరులో మూడు కేంద్రాలు ఏర్పాటుచేశారు. పరీక్షలకు సిటీ కో–ఆర్డినేటర్‌గా వైఎస్‌ఎస్‌ చంద్రశేఖర్‌ వ్యవహరించనున్నారు. ఏలూరు సీఆర్‌ఆర్‌ అటానమస్‌ కళాశాలలో 504 మంది విద్యార్థులను కేటాయించగా అబ్జర్వర్‌గా ఎం.కృష్ణ, సీఆర్‌ఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలకు 504 మందిని కేటాయించగా అబ్జర్వర్‌గా జి.ప్రభు, సత్రంపాడు ఆదిత్య డిగ్రీ కళాశాలకు 253 మందిని కేటాయించగా అబ్జర్వర్‌గా ఓ.శ్రీహరి వ్యవహరించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ మాత్రమే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులు అడ్మిట్‌ కార్డు, పాస్‌పోర్టు ఫొటో, ఐడీ కార్డు వెంట తీసుకురావాలి. పారదర్శకంగా ఉంటే మంచినీటి బాటిళ్లు మాత్రమే తీసుకురావాలి. ఫార్మల్‌ దుస్తులు ధరించాలి. ఎలక్ట్రానిక్‌ వస్తువులు, వాచ్‌లు, మొబైల్‌ ఫోన్లను అనుమతి లేదు.

నాయీ బ్రాహ్మణుల మద్దతు

దెందులూరు: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మరో సారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు రాష్ట్రంలోని నాయీ బ్రాహ్మణులంతా వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇస్తున్నామని ఆ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ అరిసెపల్లి ప్రసాద్‌ నంద అన్నారు. శనివారం దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారు మూరి సునీల్‌కుమార్‌కు మద్దతుగా ఏలూరు రూరల్‌, దెందులూరు, పెదవేగి, పెదపాడు మండలాల్లో నాయీ బ్రాహ్మణులను కలిశారు. గ్రామగ్రామానా నాయీ బ్రాహ్మణులను కలిసి రాష్ట్ర నాయకత్వం ఆదేశాలను వివరిస్తున్నా మన్నారు. మేమంతా సిద్ధం పోస్టర్లను అందజేశారు. వచ్చేది జగనన్న ప్రభుత్వమేనని, గత ఐదేళ్లల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమమే ఇందుకు కారణమని ఆయన అన్నారు.

1.70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు

ఏలూరు(మెట్రో): జిల్లాలో ఇప్పటివరకు 13,006 మంది రైతుల నుంచి రూ.337.07 కోట్ల విలువైన 1,70,198 టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జాయింట్‌ కలెక్టర్‌ బి.లావణ్య వేణి తెలిపారు. జిల్లాలోని 17 మండలాల్లోని 107 రైతు భరోసా కేంద్రాల పరిధిలో 24,461 మంది రైతులు 1,88,056 టన్నుల ధాన్యాన్ని నమోదు చేసుకున్నారన్నారు. 49 లక్షల గోనె సంచులను అందుబాటులో ఉంచామని చెప్పారు. కనీస మద్దతు ధర కామన్‌ రకం క్వింటాల్‌కు రూ. 2,183, గ్రేడ్‌–ఎ రకానికి రూ.2,203 పొందవచ్చన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులుంటే జిల్లాస్థాయిలో కంట్రోల్‌ రూమ్‌ 08812– 230448, 7702003584, 7569562076, 75695 97910 నంబర్లకు తెలియజేయాలని కోరారు.

Advertisement
Advertisement