ఏలూరు టౌన్: ఓ కేసులో అరెస్ట్ చేసిన నిందితుడు స్టేషన్‌లో కనిపించకపోవడంతో పోలీసులకు ముచ్చెమటలు పట్టాయి. ఈ ఘటన గురువారం ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఏలూరు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న వనమాటి సుబ్రహ్మణ్యంపై ఎన్‌ఐ యాక్ట్‌లో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఏలూరు టూటౌన్ పోలీసులు అతడ్ని గురువారం అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకువచ్చారు. స్టేషన్ బయట కూర్చున్న సుబ్రహ్మణ్యం మెట్లపై నుంచి స్టేషన్‌పైకి వెళ్లి చెత్తలో దాక్కున్నాడు. దీంతో పోలీసులు అతను పారిపోయాడని భావించి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఉన్నతాధికారులకు తెలిస్తే తమ ఉద్యోగాలకు ముప్పు వస్తుందనే భయంతో వణికిపోయారు. తీరా ఇదంతా నగరంలోని ఒక పోలీస్‌స్టేషన్‌లో గతంలో పనిచేసిన ఎస్సై స్థాయి అధికారి సూచనలతోనే జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యం పారిపోయి స్టేషన్‌పైన దాక్కుంటే.. మరోవైపు అతని భార్యను స్టేషన్‌కు పంపి తన భర్త ఎక్కడ ఉన్నాడంటూ హడావుడి చేయించినట్లు తెలుస్తోంది. ఆఖరికి సాయంత్రం 5.30 గంటలకు మరో స్టేషన్ పోలీస్ సిబ్బంది నేరుగా పోలీస్‌స్టేషన్ పైకి వెళ్లి దాక్కున్న సుబ్రహ్మణ్యంను కిందకు తీసుకువచ్చి పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. దీంతో బతుకుజీవుడా ఆంటూ టూటౌన్ పోలీస్ సిబ్బంది అతడ్ని కోర్టులో హాజరుపరిచి ఊపిరి పీల్చుకున్నారని అంటున్నారు. ఈ వ్యవహారం అంతా స్టేషన్‌లోని సీసీటీవీ పుటేజ్ పరిశీలిస్తే తెలుస్తుందని చెబుతున్నారు.
● చెక్‌బౌన్స్ కేసులో వ్యక్తి అరెస్ట్
● అతడు స్టేషన్‌లో కనిపించకపోవడంతో వణికిపోయిన పోలీసులు
● ఏలూరు టూటౌన్‌లో హైడ్రామా
Comments
Please login to add a commentAdd a comment