డిపార్ట్‌మెంటల్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
ఏలూరు(మెట్రో): జిల్లాలో ఈ నెల 18 నుంచి 23 వరకు నిర్వహించే డిపార్ట్‌మెంటల్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ డీఆర్‌వో చాంబర్‌లో నిర్వహణపై సమావేశం నిర్వహించారు. వట్లూరు, ప్రభుత్వ ఐటీఐ రోడ్డులోని సిద్ధార్థ క్వెస్ట్ సీబీఎస్‌సీ స్కూలు, వట్లూరులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రాల్లో ఈ నెల 18 నుంచి 23 వరకు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరుగుతాయన్నారు. ఉదయం 10 గంటల నుంచి మద్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. గ్రేస్ పిరియడ్ పరిగణలోకి తీసుకొని ఉదయం 9.30 గంటలలోపు, మధ్యాహ్నం పరీక్షకు 2.30 గంటలకు సెంటర్ గేట్ మూసివేస్తారని తెలిపారు. తప్పనిసరిగా ఒరిజినల్ గుర్తింపు కార్డును తీసుకురావాలని లేదంటే పరీక్షా కేంద్రంలోకి అనుమతించరన్నారు. తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం ఉండేలా చూడాలని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా చూసుకోవాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment