ఆకాశమేహద్దుగాగ్రావెల్‌దందా
ముసునూరు: మండలంలో గ్రావెల్ అక్రమ రవాణాకు అడ్డు లేకుండా పోయింది. విసుగు, విరామం లేకుండా, యథేచ్చగా గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. మండలంలోని చిల్లబోయినపల్లి, రమణక్కపేట, లోపూడి, సూరేపల్లి అటవీ సమీప ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువైన గ్రావెల్ నిల్వలు ఉన్నాయి. వీటిని ఆయా రైతుల నుంచి గ్రావెల్ తోలుకునేందుకు ఎకరం భూమిలోని గ్రావెల్‌కు కొంత రేటు నిర్ణయించి, ఆ ధరను రైతుకు చెల్లించి తోలకాలు చేస్తున్నారు. క్వారీ నిర్వహణకు ప్రభుత్వ అనుమతి లేకుండా, ట్యాక్స్ చెల్లించకుండా అక్రమ గ్రావెల్ రవాణాకు తెర తీస్తున్నారు. తొలుత రమణక్కపేటలో అనుమతి లేకుండా గ్రావెల్ అక్రమ తరలింపు ప్రారంభించారు. ఇటీవల చిల్లబోయినపల్లిలో ఓ రైతుకు చెందిన భూమిని ఎకరం రూ.22 లక్షల చొప్పున చెల్లించి ,గ్రావెల్ తోలుకునే ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. అనంతరం జేసీబీలు పెట్టి, రేయింబవళ్లు తేడా లేకుండా వందలాది లారీలతో విలువైన గ్రావెల్‌ను తరలిస్తున్నారు. ఇటు గ్రామ పంచాయితీకి గాని, అటు ప్రభుత్వానికి గాని ఒక్క రూపాయి చెల్లించకుండా గ్రావెల్ యూనిట్ ధర రూ.3,000 గా నిర్ణయించి యథేచ్ఛగా గ్రావెల్‌ను అమ్ముకుంటున్నారు. స్థానిక నేతలకు, అధికారులకు ముడుపులు చెల్లించి, అడ్డుకునేవారు లేకుండా చేసుకుని, అడ్డగోలుగా గ్రావెల్ అమ్ముకుని అక్రమార్జన చేస్తున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు, రెవెన్యూ అధికారులు సైతం క్వారీల్లోకి అడుగు పెట్టకుండా మేనేజ్ చేస్తున్నారని పలువురు అంటున్నారు. సహజ వనరులను కాపాడాల్సిన ప్రభుత్వ యంత్రాంగాన్ని సైతం మేనేజ్ చేసి, దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ వ్యవహారం కంచే చేను మేసినట్లుగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. తక్షణం రెవెన్యూ, పోలీసు యంత్రాంగం జరుగుతున్న దోపిడీని నిలువరించి, సహజ వనరులను కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటున్నాం
అక్రమ గ్రావెల్ రవాణాపై ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి, సిబ్బందిని పంపి నిలువరించాం. మళ్ళీ ఆ ప్రాంతంలో అడుగుపెడితే కఠిన చర్యలు తీసుకుంటాం.
– జి.పురుషోత్తమ శర్మ, ఇన్‌చార్జి తహసీల్దార్, ముసునూరు
Comments
Please login to add a commentAdd a comment