విద్యుత్ చార్జీలు తగ్గించాలి
ఉంగుటూరు : విద్యుత్ చార్జీలు తగ్గించాలంటూ చేబ్రోలులో సీపీఎం కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు విద్యుత్ బిల్లులను తగులపెట్టారు. మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు నారపల్లి రమణరావు మాట్లాడుతూ టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా స్మార్టు మీటర్లు రద్దుచేయాలని చెప్పిందని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్మార్ట్ మీటర్లు పెట్టాలని నిర్ణయించడం దారుణమన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు చీరా అప్పారావు, చిలకంటి భాస్కరరావు, బద్దపు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఏపీటీయూ ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్‌కుమార్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్ర టీచర్స్ యూనియన్ (ఏపీటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేల ప్రవీణ్ కుమార్‌ను ఎన్నుకున్నట్టు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వై.దేముడు తెలిపారు. ఆదివారం ఏపీటీయూ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశంలో ప్రవీణ్ కుమార్‌కు గుర్తింపు పత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన డీఏ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పీఆర్‌సీ కమిటీని వెంటనే నియమించి, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరారు. పదో తరగతి యాక్షన్ ప్లాన్‌ను సవరించాలని, ఆదివారం, సెలవు దినాలను ఈ ప్రణాళిక నుంచి మినహాయించాలని కోరారు.
ప్రజా చైతన్యమే రాజ్యాంగానికి రక్షణ కవచం
తణుకు అర్బన్: రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పాలకులే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని, రాజ్యాంగానికి రక్షకులుగా ఉండాల్సిన న్యాయమూర్తులు దానికి విరుద్ధంగా తీర్పులు ఇస్తున్న పరిస్థితుల్లో పౌరసమాజ సంస్థలు కల్పించే ప్రజా చైతన్యమే రాజ్యాంగానికి రక్షణ కవచమని మాజీ పార్లమెంటు సభ్యులు, రాజ్యాంగ పరిరక్షణ వేదిక వ్యవస్థాపకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు స్పష్టం చేశారు. తణుకు రాజ్యాంగ ప్రచార వేదిక సమన్వయకర్త డీవీవీయస్ వర్మ అధ్యక్షతన ఆదివారం స్థానిక సురాజ్య భవన్‌లో నిర్వహించిన పౌర సంస్థల, ప్రజాసంఘాల సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం కలిగించేలా కార్యక్రమాలు నిర్వహించాలని పౌర సంస్థలకు, ప్రజా సంఘాలకు విజ్ఞప్తి చేశారు. విశ్రాంత ఐఏఎస్ బండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా రిపబ్లిక్ భావన ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. సంధానకర్తలుగా ఏఐటీయుసి నాయకులు కోనాల భీమారావు, సీఐటీయు నాయకులు పీవీ ప్రతాప్, సామాజిక న్యాయపోరాట సమితి వ్యవస్థాపకుడు పి.మురళీకుమార్, వివిధ రంగాల ప్రముఖులు డా.గుబ్బల తమ్మయ్య, ఎస్.మనోరమ, డా.రమేష్ వ్యవహరించారు. కార్యక్రమంలో అడబాల లక్ష్మీ, డి.సోమసుందర్, డా.జి.అబ్బయ్య, తణుకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సూరంపూడి కామేష్, రోటరీ క్లబ్ ఆధ్యక్షుడు ఆనందం మస్తాన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
మహిళా చట్టాలపై అవగాహన అవసరం
పెనుమంట్ర: మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించినప్పుడే నేరాలు సంఖ్య తగ్గుతుందని జిల్లా నాలుగో అదనపు జడ్జి డి.సత్యవతి అన్నారు. ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో పెనుమంట్ర, ఇరగవరం మండలాలకు చెందిన ఆశ, అంగన్‌వాడి కార్యకర్తలు, డ్వాక్రా మహిళలతో విధాన్ సమాధాన్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్జి మాట్లాడుతూ మహిళా విభాగాలకు చెందిన ఉద్యోగులంతా సమన్వయంతో పని చేస్తూ.. మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కే కృష్ణ సత్యలత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.సాయిరాం, రెండో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఏవి నాగరాజు, స్పెషల్ క్లాస్ మేజిస్ట్రేట్ టీవీ చిరంజీవి రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment