పారిశుద్ధ్య కార్మికుల ధర్నా
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రి పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది హాస్పిటల్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఏఐటీయుసీ జిల్లా కార్యదర్శి కంకిపాటి బుచ్చిబాబు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేల రూపాయలు ఇవ్వాలని, కాంట్రాక్టు ఏజెన్సీని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలు ఇవ్వాలని గత మూడు రోజులుగా భోజన విరామ సమయంలో కార్మికులు ధర్నా చేస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో తమ సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మెకు దిగుతారని హెచ్చరించారు. చాలీచాలని వేతనాలతో దుర్భరమైన పరిస్థితి ఎదుర్కొంటున్న పారిశుద్ధ కార్మికులకు, ఏజెన్సీల పేరిట దళారుల వ్యవస్థను కొనసాగించడం సహేతుకం కాదని, ప్రభుత్వం స్పందించి కార్మికులను ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఇవ్వాల్సిన పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి కూనపాముల విఘ్నేష్, ఏఐటీయూసీ గౌరవాధ్యక్షుడు జంపన వెంకటరమణ రాజు, ఏఐటీయుసీ మండల కార్యదర్శి కుంచె వసంతరావు, లొట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment