వేద పాఠశాలలో బాలుడి ఆత్మహత్య
కై కలూరు : నిత్యం శివార్చనలో తరిస్తున్న ఆ దంపతులకు చాన్నాళ్లు సంతానం లేదు. యాగాలు, హోమాలు, నోములు, ఉపవాసాల అనంతరం 16 ఏళ్లకు మగ బిడ్డ పుట్టడంతో సాయి శివ సూరజ్ అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ప్రాథమిక విద్య అనంతరం వేద పాఠశాలకు పంపారు. విధి కన్నెర్ర చేసిందో ఏమో సూరజ్ తాను విద్యనభ్యసిస్తున్న వేద పాఠశాలలో బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఊహించని ఈ ఘటనతో అతని తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఏంటి శివయ్యా.. నువ్వే బిడ్డను ప్రసాదించి.. నీ వద్దకే వాడిని తీసుకుపోయావా.. అంటూ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు చూసి చూపరులు కన్నీటిపర్యంతమయ్యారు.
ఓ తరం వారసుడు అస్తమయం..
కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం చిన తుమ్మిడి గ్రామానికి చెందిన కుందుర్తి శివశ్రీ, ఛాయా కుమారి దంపతులు పదేళ్ల క్రితం ఏలూరు జిల్లా కై కలూరు మండలం భుజబలపట్నం లో భీమేశ్వరస్వామి శివాలయంలో అర్చకత్వానికి వచ్చారు. కుమారుడు సాయి శివ సూరజ్ (16)కు కై కలూరు ప్రైవేటు స్కూల్‌లో ప్రాథమిక విద్య నేర్పి, నాలుగేళ్ల క్రితం పల్నాడు జిల్లా నరసారావుపేట సమీప కోటప్పకొండలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలోని శ్రీ వేంకటేశ్వర వేద పాఠశాలలో చేర్పించారు. ఎనిమిదేళ్ల శైవాగమం కోర్సులో నాలుగేళ్లు పూర్తిచేసిన సూరజ్.. బుధవారం రాత్రి 9–10 గంటల మధ్య వేద పాఠశాల హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూరజ్ తండ్రి శివశ్రీ కూడా ఆ కుటుంబంలో ఒక్కడే కుమారుడు కావడం గమనార్హం. అతనికి ఆరుగురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. మొత్తం మీద ఓ తరానికి వారసుడిని కోల్పోవడంతో కుటుంబం మొత్తం గుండెలవిసేలా రోదిస్తోంది. ఎంతో చలాకీగా నవ్విస్తూ, నవ్వుతూ ఉండే సూరజ్ ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మబుద్ధి కావడం లేదని కై కలూరు పరిసర ప్రాంత పలు అర్చక కుటుంబాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దోషులను శిక్షించాలి
కుందుర్తి సాయి శివ సూరజ్ బలన్మరణానికి వేద పాఠశాల ప్రిన్సిపాల్ వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తి విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కై కలూరుకు చెందిన ఆదిశైవ అర్చక సంఘం, ఏలూరు జిల్లా జాయింట్ సెక్రటరీ చావలి శంకరశాస్త్రి గురువారం డిమాండ్ చేశారు.
కోటప్పకొండలో ఘటన
తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు
Comments
Please login to add a commentAdd a comment