శృంగవృక్షంలో డయేరియా విజృంభణ
పాలకోడేరు: మేజర్ పంచాయతీ శృంగవృక్షం గ్రామం ఐదు రోజులుగా డయేరియా కేసులతో అట్టుడుకుతోంది. ప్రతి ఇంటిలోనూ ఒక్కరైనా వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడుతున్నారు. పంచాయతీ ఉద్యోగి ఇటీవల ఉపయోగించని రావిచెరువులోని కలుషిత నీటిని పైపుల ద్వారా సరఫరా చేయడంతో ఈ దుస్థితి తలెత్తినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై గురువారం జరిగిన పంచాయతీ బోర్డ్ సమావేశంలో ఎంపీటీసీ సత్య కృష్ణ, వార్డ్ సభ్యులు సోము దుర్గాభవాని పంచాయతీ కార్యదర్శిని నిలదీశారు. అయితే తనకు తెలియకుండా జరిగిందని బదులిచ్చారు. సదరు ఉద్యోగిని ప్రశ్నిస్తే తప్పయిపోయిందని ఒప్పుకున్నాడు. అయితే కలుషిత నీటి కారణంగా ఇప్పటివరకు నలుగురు మృతి చెందారని, ఈ విషయాలు బయటకు పొక్కకుండా కొందరు ప్రయత్నిస్తున్నట్లు స్థానికులు క్రొవ్విడి దుర్గ తదితరులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికీ ఇదే కలుషిత నీటినే కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్నారని వడ్డీల వీధిలోని మహిళలు వాపోతున్నారు. గ్రామంలో పారిశుధ్యం అధ్వానంగా ఉందని, ఎవరూ పట్టించుకోవడం లేదని, వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నా సరిపడ మందులు లేవని కాలనీవాసులు మండిపడుతున్నారు. దీనిపై ఎంపీడీవో వి రెడ్డియ్యను వివరణ కోరగా పంచాయతీ సరఫరా చేసే జలాలు ఎక్కడ కలుషితమవుతున్నాయో పరిశీలించి సురక్షిత నీటిని అందిచేలా చర్యలు చేపడతామని చెప్పారు.
రోజురోజుకూ పెరుగుతున్న కేసులు
కలుషిత నీరే కారణం అంటున్న ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment