సొసైటీ ఉద్యోగుల నిరసన బాట
ఏలూరు (టూటౌన్): ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల (సొసైటీ) ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏపీ స్టేట్ అగ్రికల్చరల్ కో–ఆపరేటివ్ సొసైటీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేశారు. జిల్లావ్యాప్తంగా ఉద్యోగులు తరలివచ్చారు. సొసైటీ ఉద్యోగులకు హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని, గ్రాట్యూటీ చెల్లించాలని, పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని, సొసైటీల ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని, సిబ్బందిని కుదించే ఆలోచన మానుకోవాలని నినదించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు టి.గంగరాజు, జిల్లా అధ్యక్షుడు కేవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ 2019లో జారీ చేసిన జీఓ 36ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సహకార సంఘాల వ్యవస్థ ప్రైవేటీకరణకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. సంఘాల్లో సిబ్బందిని కుదించే ఆలోచనలను ప్రభుత్వాలు మానుకోవాలని హితవు పలికారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జి.రాజు, సీహెచ్ సుందరయ్య, కే.విజయలక్ష్మి, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడారు. అనంతరం కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment