ప్రభుత్వ నాశనం తప్పదు
మా పింఛన్లు తొలగిస్తే..
తణుకు అర్బన్: పింఛను వెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులను ఆస్పత్రులకు రప్పిస్తున్న కూటమి ప్రభుత్వం వారికి చుక్కలు చూపిస్తోంది. తనిఖీ కేంద్రానికి వచ్చిన దివ్యాంగులు రెండు రోజుల పాటు వేచి ఉన్నా ఇంతవరకూ ప్రక్రియ పూర్తిచేయకపోగా బుధవారం రావాలని చెప్పడంతో దివ్యాంగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంటి చూపు లేని దివ్యాంగులు రెండు రోజులుగా సహాయకులతో కేంద్రానికి వచ్చి నానా యాతన పడుతున్నారనే ఆలోచన లేకుండా వ్యవహరిస్తోందని వారు మండిపడుతున్నారు. తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఈ నెల 20న ప్రారంభించిన పింఛను వెరిఫికేషన్‌కు సంబంధించి తొలి దశలో కంటి, చెవికి సంబంధించి విభాగానికి 70 మంది చొప్పున రెండు విభాగాల్లోనూ 140 మందిని రావాల్సిందిగా వార్డు సెక్రటరీల ద్వారా నోటీసులు ఇచ్చి రప్పించారు. సోమవారం ప్రారంభమైన ఈ వెరిఫికేషన్‌కు సంబంధించి దివ్యాంగులకు నరకం భూమి మీదే చూపించే స్థితిని ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చింది. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు వచ్చిన దివ్యాంగులు సాయంత్రం ఆరు గంటల వరకు శిబిరం వద్ద వేచి చూసినా సాంకేతిక లోపం కారణంగా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. వారంతా మంగళవారం శిబిరానికి వచ్చారు. మంగళవారం కూడా పూర్తికాకపోవడంతో బుధవారం రావాలని చెప్పారు. దీంతో దివ్యాంగులు మాకు ఇదేం ఖర్మ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్లూ ఉదయం ఐదు గంటలకే వలంటీర్లు ఇంటికి వచ్చి పింఛను ఇచ్చారని, ఎప్పుడూ ఇలా వెరిఫికేషన్ చేయలేదని, తమ చావు చూసేందుకే ఈ ప్రభుత్వం దాపురించిందంటూ మండిపడుతున్నారు.
ఇది మంచి ప్రభుత్వమా..?
ఇది మంచి ప్రభుత్వం అంటూ బాకాలు ఊదుకుంటూ చివరకు తమ నోటికాడ కూడు లాగేసుకునేలా ఉన్నారంటూ దివ్యాంగులు గగ్గోలు పెడుతున్నారు. 20 సంవత్సరాల నుంచి తీసుకుంటున్న పింఛనుపై ఇప్పుడు అనుమానం ఏం వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగుల నోట్లో మట్టికొట్టేలా వ్యవహరిస్తున్నారని, తమ పింఛన్లు తొలగిస్తే ప్రభుత్వానికి నాశనం తప్పదంటూ తిట్ల దండకం అందుకుంటున్నారు. తనిఖీ కేంద్రం వద్దకు వచ్చినవారికి మంచినీటి ప్యాకెట్లు తప్ప ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని, ఆకలితో అలమటించామని వాపోతున్నారు. పింఛను పెంచడమెందుకు.. ఇప్పుడు తొలగించేందుకు కుట్రలు పన్నడం ఎందుకని దివ్యాంగులు ప్రశ్నిస్తున్నారు.
ఏళ్ల తరబడి అందుకుంటున్న పింఛనుపై ఇప్పుడు అనుమానాలా? మా పింఛన్లు తొలగిస్తే.. ప్రభుత్వ నాశనం తప్పదు..
– ఇదీ ఓ దివ్యాంగుడి ఆగ్రహం
దివ్యాంగులమనే జాలి కూడా లేదు. తనిఖీల పేరుతో రోజుల తరబడి ఇబ్బందులు పెడుతున్నారు. మా నోటికాడ కూడు కూడా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఇదేనా మంచి ప్రభుత్వం అంటే?
– ఇదీ ఓ దివ్యాంగురాలి ఆవేదన
కూటమి సర్కారు తీరుపై దివ్యాంగుల తిట్ల దండకం
తనిఖీ పేరుతో రెండు రోజులుగా ఇబ్బందులు పెట్టడంపై ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment