జీడిమామిడికి మంచు దెబ్బ
బుట్టాయగూడెం: గత కొద్ది రోజులుగా కురుస్తున్న మంచు దెబ్బకు జీడిమామిడి రైతులు విలవిల్లాడుతున్నారు. పంటలపై పెట్టుకున్న ఆశలను మంచురూపంలో చిదిమేస్తుంది. గత రోజులుగా తేనె మంచు ప్రభావంతో రైతులకు అపార నష్టం కలిగిస్తుంది. మంచు ప్రభావంతో జీడిమామిడి పంటలకు పూసిన పూత మాడిపోయి రాలిపోతుందని, పంటలకు తెగుళ్లు కూడా వ్యాప్తి చెందుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచు నుంచి రక్షించుకుని పంటలను కాపాడుకునేందుకు మందులు కొట్టినప్పటికీ గత వారం రోజులుగా విపరీతమైన పొగ మంచు కురవడంతో పంటలు బాగా దెబ్బతినే పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జీడి మామిడి సాగు ఇలా
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో సుమారు 25 వేల హెక్టార్లలో జీడిమామిడి పంట సాగు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో అత్యధికంగా ఏజెన్సీ మెట్టప్రాంతాల్లో రైతులు జీడిమామిడి పంటలు సాగు చేస్తున్నారు. ఇటీవల కురుస్తున్న మంచువల్ల పూతను ఆశ్రయించి రసం పీల్చే పురుగు, కుళ్లుతెగులు వంటివి జీడిమామిడి పంటపై వ్యాప్తి చెందుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ తెగుళ్ల ప్రభావం వల్ల పూత మాడిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెగుళ్లు, పురుగుల నివారణకు అప్పులు చేసి మరీ మందులను స్ప్రేయింగ్ చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. ఏజెన్సీ మెట్టప్రాంతాల్లో నీటి సౌకర్యం లేకపోవడంతో రైతులు అత్యధికంగా జీడిమామిడి పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో గిరిజనులకు ఆదాయాన్ని పెంచే విధంగా ఐటీడీఏ ద్వారా జీడిమామిడి పంటలను ప్రోత్సహిస్తున్నారు. సుమారు 3000 ఎకరాల వరకూ ఈ ప్రాంతంలోనే గిరిజనులు జీడిమామిడి పంటను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం జీడిమామిడి పంటలోని పూత పొగమంచుతో మాడిపోవడంతో గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకు సలహాలు, సూచనలతోపాటు పురుగు మందులను కూడా అందించే విధంగా సహకరించాలని రైతులు కోరుతున్నారు.
పూత మాడిపోతోంది
నేను సుమారు ఎకరం జీడిమామిడి పంటను సాగు చేస్తున్నాను. గత కొద్ది రోజులుగా కురుస్తున్న పొగమంచుతో జీడిమామిడితోటకు పూసిన పూత మాడిపోతోంది. తెగుళ్లు వ్యాప్తి చెందడంతో వాటికి అప్పులు చేసి మరీ పురుగు మందుల స్ప్రేయింగ్ పనులు చేయిస్తున్నాం. పూతమాడిపోకుండా సలహాలు, సూచనలు ఇవ్వడంతోపాటు మందులను కూడా అందించే విధంగా అధికారులు కృషి చేయాలి.
– తెల్లం పండు, జీడిమామిడి రైతు, కంసాలికుంట
మంచుతో కోలుకోలేని నష్టం
పొగమంచు పంటలను దెబ్బతీస్తుంది. మంచు వల్ల జీడిమామిడి పూత మాడిపోతుంది. నేను 4 ఎకరాల్లోజీడిమామిడి పంట సాగు చేస్తున్నాను. మంచు వల్ల పూత రాలిపోయి దిగుబడి తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల మేము నష్టపోతున్నాం. అధికారులు స్పందించి రైతులకు మేలైన సూచనలు చేయాలి.
– తెల్లం లక్ష్మణరావు, జీడిమామిడి రైతు, కంసాలికుంట
మాడిపోతున్న పూత
జిల్లాలో 25 వేల ఎకరాల్లో జీడిమామిడి పంట సాగు
Comments
Please login to add a commentAdd a comment